సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుల్ ఎంపిక ప్రాథమిక రాతపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మరో 35 పట్టణాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. సివిల్ కానిస్టేబుల్ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు 6.61 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, గంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని బోర్డు పేర్కొంది.
పరీక్షాకేంద్రానికి నిర్ణీత సమయంకన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై నిర్దేశించిన ప్రాంతంలో పాస్‌పోర్టు సైజు ఫొటో అంటించుకొని రావాలని, అలాచేయని పక్షంలో లోపలికి అనుమతించబోమని తెలిపింది. పరీక్షాకేంద్రంలోకి బ్యాగులు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయనున్నామని పేర్కొంది. 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రం ఉంటుందని, తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్ మార్కు ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment