
సాక్షి, హైదరాబాద్: నూతన జోనల్ విధానంప్రకారం ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపుల్లో బీసీలు తీవ్రంగా నష్టపోయారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం జరిగిన బీసీ ఉద్యోగ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 25 శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
ఆప్షన్ ఫారంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కాలమ్ పెట్టలేదని తెలిపారు. మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో జిల్లా కేటాయింపులు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. కేవలం సీనియార్టీని ప్రామాణికంగా తీసుకోవడంతో మెరిట్ ఉన్న ఉద్యోగులు, జూనియర్లు తీవ్రం గా నష్టపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ తప్పిదాలను సవరించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ మెరిట్, రోస్టర్ పద్ధతిని, స్థానికతను పాటించాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment