సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా, అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజాగా ఐటీ కారిడార్ వద్ద ఉన్న దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సహా మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు.
నగరంలో ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్ లేక్’ గుర్తింపు ఉంది. హైటెక్‌సిటీ వెలిశాక చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. అధికారులు వాటి జోలికి వెళ్లలేదనేది వాస్తవం. కానీ, ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.
దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా.. కొందరు ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్.. వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా 30 రోజుల్లో స్వచ్చందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టరీత్యా తామే కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు.
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉంది. దీంతో, తిరుపతి రెడ్డికి కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సోసైటీ, కావూరీ హిల్స్‌లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలన్నింటిని కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
నాకు ఎలాంటి అభ్యంతరం లేదు: తిరుపతి రెడ్డి
ఇక, తహసీల్దార్ నోటీసులపై తాజాగా సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు నా దృష్టికి వచ్చింది. నేను 2015లో అమర్ సొసైటీలో ఒక ఇంటిని కొనుగోలు చేశాను. నేను ఇంటిని కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం నాకు తెలియదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో నా బిల్డింగ్ ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment