సీనియర్ జర్నలిస్టు జీఎస్ వరదాచారి భౌతికకాయం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు గోవర్ధన సుందర (జీఎస్) వరదాచారి (92) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. పంజాగుట్ట జర్నలిస్టు కాలనీలో నివాసం ఉండే ఆయనకు భార్య సరోజిని, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. భార్య 2000 సంవత్సరంలోనే చనిపోయారు. వరదాచారి మృతి పట్ల పలువురు ప్రముఖులు, సీనియర్ పాత్రికేయులు సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం పంజాగుట్ట çశ్మశానవాటికలో వరదాచారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సుదీర్ఘ పాత్రికేయ జీవితంతో..
జీఎస్ వరదాచారి 1932లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జన్మించారు. న్యాయవాద కోర్సుతోపాటు జర్నలిజంలో డిప్లొమా చేశారు. 1956 ఒక తెలుగు దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. 1961లో ఆంధ్రభూమి దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా చేరి 22 ఏళ్లు పనిచేశారు. 1983లో ఈనాడులో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. అనంతర కాలంలో తెలుగు విశ్వవిద్యాలయం, ఇతర యూనివర్సిటీలు, ప్రముఖ దినపత్రికల జర్నలిజం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతుల్లో ‘పత్రికల భాష’ అంశంపై శిక్షణ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.
సంతాపం తెలిపిన ప్రముఖులు
జర్నలిజంలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు వరదాచారి తీసుకున్న చొరవ యావత్ పాత్రికేయ సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జర్నలిజంపై జీఎస్ వరదాచారి బోధనలు నేటి తరానికి గొప్ప స్ఫూర్తి అని, ఆయన మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. వరదాచారి మృతిపట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు, కార్యదర్శి కె.లక్ష్మణ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
జర్నలిజానికి సుదీర్ఘ సేవలు: సీఎం కేసీఆర్
జీఎస్ వరదాచారి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా జర్నలిజం రంగానికి సేవలందించారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment