సాక్షి, కోదాడ: ఒకప్పుడు విద్యుత్ హెల్పర్లు, లైన్‌మన్‌లు, కార్మికులు స్తంభం ఎక్కాలంటే చాలా కష్టంగా ఉండేది. ఏమాత్రం పట్టు జారినా ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. కానీ ఇప్పుడు క్లైంబింగ్ షూతో సులువుగా ఎలాంటి భయం లేకుండా విద్యుత్ స్తంభం ఎక్కేస్తున్నారు. పట్టణాల్లో విద్యుత్ స్తంభాలపై విద్యుత్ తీగలు గజిబిజిగా ఉంటాయి. గంటల తరబడి స్తంభాలపై కనెక్షన్లు వెతుక్కోవలసి వస్తుండటంతో శరీరం బరువు కాళ్లు, చేతులపై పడుతోంది. ఆ సమయంలో లైన్‌మన్‌లు, హెల్పర్లు, కార్మికులు పట్టు కోల్పోయి జారిపడే ప్రమాదం ఉంది.
క్లైంబింగ్ షూతో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడింది. క్లైంబింగ్ షూతో స్తంభంపై ఎక్కడ అంటే అక్కడ తాపీగా నిలబడుతున్నారు. దీంతో రాత్రివేళ కూడా సులువుగా స్తంభాలు ఎక్కి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యుత్ ఉద్యోగి క్లైంబింగ్ షూకి రూపకల్పన చేసి ఉపయోగించిన వీడియో యూట్యూబ్, వాట్సాప్‌లలో హల్‌చల్ చేసింది. దీనిని చూసి తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ శాఖల హెల్పర్లు, లైన్‌మన్‌లు విరివిగా దీని వాడకం మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లో కేవలం రూ.300 నుంచి రూ.450 ఖర్చుతో క్లైంబింగ్ షూ తయారు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment