సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు నాగార్జునసాగర్ జలాశయానికి ఎలాంటి ప్రవాహం రాలేదని, గతేడాది తాము వా డుకోకుండా పొదుపు చేసిన 18 టీఎంసీల నీళ్లే ప్రస్తుతం జలాశయంలో మిగిలి ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది. ఈ నీళ్లను వినియోగంపై తమకే హక్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి. మురళీ ధర్ గురువారం కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.
పొదుపు చేసిన జలాలు మావే..
కొత్త నీటి సంవత్సరం ప్రారంభమైన తర్వాత జలాశయంలో అప్పటికే మిగిలి ఉండే నిల్వల్లో కొత్త ప్రవాహం వచ్చి కలిసిపోతుందని, ఈ నేపథ్యంలో గతేడాది పొదుపు చేసిన జలాలను మరుసటి ఏడాది సంబంధిత రాష్ట్రానికి కేటాయించాలంటే(క్యారీ ఓవర్).. రెండు రాష్ట్రాల సమ్మతి అవసరమని గత కృష్ణా బోర్డు సమావేశంలో చైర్మన్ పేర్కొన్న విషయాన్ని తెలంగాణ గుర్తు చేసింది.
వాస్తవానికి ప్రస్తుత ఏడాది జలాశయం పూర్తిగా నిండి గేట్లను ఎత్తే నాటి వరకు గతేడాది తాము పొదుపు చేసిన 18 టీఎంసీలను వాడుకోవచ్చని, దీని ద్వారా పొరుగు రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం కలగదని తెలియజేసింది. కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి తమకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ జలాశయాలు లేకపోవడంతో 2023–24కి సంబంధించిన తాగు, సాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయం సాగర్‌లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేసింది. గతేడాది ఏపీ తమ వాటాకు మించి 51.745 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించిందని ఆరోపించింది.
సాగర్ కుడి కాల్వ తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలే
కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో సమర్పించిన వివిధ ప్రాజెక్టు నివేదికల ప్రకారం సాగర్ కుడి కాల్వ కింద వార్షిక తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలు మాత్రమేనని కాగా, గత జూలై నెల తాగునీటి అవసరాల కోసం నుంచి 5 టీఎంసీల నీళ్లను కేటాయించాలని ఏపీ కోరడం పట్ల లేఖలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డు 17వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు రెఫర్ చేయాలని తెలంగాణ రాష్ట్రం మరోసారి కోరింది.
Comments
Please login to add a commentAdd a comment