Krishna board letter
-
ఏపీ, తెలంగాణ మధ్య ‘కృష్ణా’ మంటలు!
సాక్షి, హైదరాబాద్: మండు వేసవి కృష్ణా జలాల్లో మంటలు పుట్టించింది. కృష్ణా జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో తాజాగా ఇరు రాష్ట్రాలు కోట్లాటకు దిగాయి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీల జలాలను తెలంగాణ వాడుకుందని ఏపీ ఆరోపించింది. లెక్కాపత్రం లేకుండా తెలంగాణ చేస్తున్న నీటి వాడకాన్ని నియంత్రించడానికి సత్వరమే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా బోర్డుకు ఈ నెల 1న లేఖ రాసింది. త్రిసభ్య కమిటీకి నీటి అవసరాలపై సరైన ఇండెంట్లు సమర్పించకుండానే.. బోర్డు నుంచి వాటర్ రిలీజ్ ఆర్డర్లు లేకుండానే తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను వాడుకుందని లేఖలో ఆరోపించింది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 513.4 అడుగులకు పడిపోగా నిల్వలు 137.515 టీఎంసీలకు తగ్గిపోయానని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. డెడ్ స్టోరేజీ లెవల్ 505 అడుగులకు ఎగువన వాడుకోవడానికి వీలుగా 14.182 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నా యని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఏపీ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసేందుకు అనుమతించేలా సీఆర్పీఎఫ్ బలగాలకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు నీటి విడుదల ప్రక్రియను పర్యవేక్షించడానికి సిబ్బందిని పంపించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. సభ్యులంతా హాజరు కావాలన్న బోర్డు.. ఏపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు ఈ నెల 4న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, సభ్యులందరూ హాజరు కావాలని ఇరు రాష్ట్రాలను కోరింది. త్రిసభ్య కమిటీ కన్వినర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు వ్యహరించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలతోపాటు నీటి విడుదల ఆర్డర్ల జారీపై ఈ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ఏప్రిల్, మేలలో తాగునీటి సరఫరాకు సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని పంపుల ద్వారా తరలించాలని ఇప్పటికే తెలంగాణ నిర్ణయం తీసుకుంది. ‘42.39 టీఎంసీలను తెలంగాణ వాడేసుకుంది’ శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి తమ రాష్ట్రానికి 45 టీఎంసీలు కేటాయించగా తాము 42.457 టీఎంసీలనే వినియోగించుకున్నామని... కానీ తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయిస్తే 7.391 టీఎంసీలు అధికంగా మొత్తం 42.391 టీఎంసీలను వాడుకుందని ఏపీ ఆరోపించింది. ఏపీలో తాగునీటికి తీవ్ర కొరత ఉన్నందున పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నెల 8 నుంచి నీటి విడుదలకు అనుమతించాలని కోరింది. ఏపీ ఆరోపణలకు బదులిస్తూ త్వరలో తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాయనుంది. -
సాగర్‌లోని నిల్వలు మావే!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు నాగార్జునసాగర్ జలాశయానికి ఎలాంటి ప్రవాహం రాలేదని, గతేడాది తాము వా డుకోకుండా పొదుపు చేసిన 18 టీఎంసీల నీళ్లే ప్రస్తుతం జలాశయంలో మిగిలి ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది. ఈ నీళ్లను వినియోగంపై తమకే హక్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీ ధర్ గురువారం కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. పొదుపు చేసిన జలాలు మావే.. కొత్త నీటి సంవత్సరం ప్రారంభమైన తర్వాత జలాశయంలో అప్పటికే మిగిలి ఉండే నిల్వల్లో కొత్త ప్రవాహం వచ్చి కలిసిపోతుందని, ఈ నేపథ్యంలో గతేడాది పొదుపు చేసిన జలాలను మరుసటి ఏడాది సంబంధిత రాష్ట్రానికి కేటాయించాలంటే(క్యారీ ఓవర్).. రెండు రాష్ట్రాల సమ్మతి అవసరమని గత కృష్ణా బోర్డు సమావేశంలో చైర్మన్ పేర్కొన్న విషయాన్ని తెలంగాణ గుర్తు చేసింది. వాస్తవానికి ప్రస్తుత ఏడాది జలాశయం పూర్తిగా నిండి గేట్లను ఎత్తే నాటి వరకు గతేడాది తాము పొదుపు చేసిన 18 టీఎంసీలను వాడుకోవచ్చని, దీని ద్వారా పొరుగు రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం కలగదని తెలియజేసింది. కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి తమకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ జలాశయాలు లేకపోవడంతో 2023–24కి సంబంధించిన తాగు, సాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయం సాగర్‌లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేసింది. గతేడాది ఏపీ తమ వాటాకు మించి 51.745 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించిందని ఆరోపించింది. సాగర్ కుడి కాల్వ తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలే కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో సమర్పించిన వివిధ ప్రాజెక్టు నివేదికల ప్రకారం సాగర్ కుడి కాల్వ కింద వార్షిక తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలు మాత్రమేనని కాగా, గత జూలై నెల తాగునీటి అవసరాల కోసం నుంచి 5 టీఎంసీల నీళ్లను కేటాయించాలని ఏపీ కోరడం పట్ల లేఖలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డు 17వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు రెఫర్ చేయాలని తెలంగాణ రాష్ట్రం మరోసారి కోరింది. -
చారిత్రక అన్యాయాలను సరిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం రెండు విభాగాలుగా గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరి చేయాలని, గెజిట్ నోటిఫికేషన్ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఒకే విభాగంగా పొందుపర్చాలంటూ నీటిపారుదల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.మురళీధర్ ఆదివారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు మరోసారి లేఖ రాశారు. 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 25 టీఎంసీల నీటి తరలింపు సామర్థ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కాంపోనెంట్–1గా, నీటి తరలింపును 40 టీఎంసీలకు పెంచడంద్వారా ఆయకట్టును 3.65 లక్షల ఎకరాలకు పెంచేందుకు తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన ప్రాజెక్టు విస్తరణ పనులను కాంపోనెంట్–2గా గెజిట్ నోటిఫికేషన్లోకేంద్రం పేర్కొంది. ఒకే ప్రాజెక్టును రెండు విభాగాలుగా చూపడం సరికాదని లేఖలో తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టును 2.5 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచారని, నీటి కేటాయింపులను ఇందుకు అనుగుణంగా పెంచలేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెంచుతూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో పెంచిన ఆయకట్టుకే తెలంగాణ ప్రభుత్వం సరిపడా నీటి కేటాయింపులు చేసిందని, కొత్తగా ఆయకట్టు పెంచలేదన్నారు. కొత్త వనరుల నుంచి నీటిని తీసుకోవడం లేదన్నారు. మా ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లోవే.. ఏపీవి కావు! శ్రీశైలం జలాశయంలో 800కుపైగా అడుగుల వద్ద నుంచి నీటిని తోడేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మిస్తామని 2006లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందని తెలంగాణ గుర్తుచేసింది. 885 అడుగులపైన నీటిమట్టం నుంచి నీటిని తోడుకొనేలా గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను డిజైన్ చేసినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించిందని పేర్కొంది. కల్వకుర్తి ఎత్తిపోతల కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టే కావడంతో అప్పట్లో శ్రీశైలం జలాశయంలోని 800 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్ చేశారని తెలిపింది. పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాజెక్టులు కావడంతో గాలేరు–నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ వంటి ఆంధ్ర ప్రాజెక్టులను శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగుల నుంచి నీటిని తీసుకొనేలా డిజైన్ చేశారని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సైతం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇదే కారణంగా 800కుపైగా అడుగుల నుంచి నీటిని తోడుకొనే విధంగా డిజైన్ చేసినట్లు వివరించింది. 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలను కల్వకుర్తికి కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్–2 ముందు వాదించామని తెలిపింది. గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు మిగులు జలాలనే ఏపీ కోరిందని, 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలు కేటాయించాలని కోరలేదని తెలిపింది. -
తాగునీటి వినియోగాన్ని 20 శాతంగా లెక్కించండి
సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాలకు కేటాయించే కృష్ణా జలాల్లో వినియోగాన్ని కేవలం 20 శాతంగా మాత్రమే లెక్కించాలని తెలంగాణ మరోమారు కృష్ణా బోర్డును కోరింది. బచావత్ ట్రిబ్యునల్ సైతం తాగునీటి అవసరాల్లో కేవలం 20 శాతమే లెక్కించాలని తెలిపిన అంశాన్ని బోర్డు దృష్టికి తెచ్చింది. కేంద్ర జల సంఘం ఇటీవలి నీటి లభ్యత అధ్యయనంలో గృహావసరాలకు వినియో గించే నీటిని 15 శాతం కిందే లెక్కించాలని సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పటికే బ్రిజేశ్ ట్రిబ్యునల్ వద్ద 2051 వరకు పెరిగే జనాభాకు అనుగుణంగా కృష్ణా బేసిన్లో 15.06 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరిన విషయాన్ని బోర్డుకు తెలిపింది. ఈ మేరకు గురువారం ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. -
జూరాల, శ్రీశైలం అతి వినియోగంపై సంయుక్త పర్యవేక్షణ
- ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగిస్తోందని తెలంగాణ చేసిన ఫిర్యాదుపై స్పందించి సంయుక్త పర్యవేక్షణ కమిటీ నియమించిన కృష్ణా బోర్డు, ప్రస్తుతం ఏపీ చేసిన ఫిర్యాదులపైనా స్పందించింది. జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ అధిక నీటిని వినియోగిస్తోందన్న ఫిర్యాదుపై సంయుక్త కమిటీతో విచారణ చేసేందుకు సిద్ధమైంది. జూరాల, శ్రీశైలం నుంచి నీటి వినియోగ లెక్కలను ఎప్పటికప్పుడు గణించి, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పక్కాగా చూసుకునేందుకు వీలుగా అధికారుల పేర్లు సూచించాలని శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి కేసీ కెనాల్ ద్వారా సాగునీటికి 11 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ అవసరాలకు 2.5 టీఎంసీలు విడుదల చేయాలంటూ ఏపీ పెట్టుకున్న అభ్యర్థనపై స్పందించాలని తెలంగాణకు విడిగా మరో లేఖ రాసింది.