కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకుందన్న ఏపీ
కృష్ణా బోర్డుకు ఫిర్యాదు.. తక్షణమే త్రిసభ్య కమిటీ భేటీ నిర్వహణకు విజ్ఞప్తి
ఏపీ వినతిపై స్పందించిన బోర్డు.. 4న సమావేశం ఏర్పాటుకు నిర్ణయం
ఏపీ ఆరోపణలపై బోర్డుకు త్వరలో లేఖ రాయనున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: మండు వేసవి కృష్ణా జలాల్లో మంటలు పుట్టించింది. కృష్ణా జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో తాజాగా ఇరు రాష్ట్రాలు కోట్లాటకు దిగాయి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీల జలాలను తెలంగాణ వాడుకుందని ఏపీ ఆరోపించింది. లెక్కాపత్రం లేకుండా తెలంగాణ చేస్తున్న నీటి వాడకాన్ని నియంత్రించడానికి సత్వరమే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా బోర్డుకు ఈ నెల 1న లేఖ రాసింది.
త్రిసభ్య కమిటీకి నీటి అవసరాలపై సరైన ఇండెంట్లు సమర్పించకుండానే.. బోర్డు నుంచి వాటర్ రిలీజ్ ఆర్డర్లు లేకుండానే తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను వాడుకుందని లేఖలో ఆరోపించింది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 513.4 అడుగులకు పడిపోగా నిల్వలు 137.515 టీఎంసీలకు తగ్గిపోయానని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. డెడ్ స్టోరేజీ లెవల్ 505 అడుగులకు ఎగువన వాడుకోవడానికి వీలుగా 14.182 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నా యని స్పష్టం చేసింది
ఈ నేపథ్యంలో ఏపీ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసేందుకు అనుమతించేలా సీఆర్‌పీఎఫ్ బలగాలకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు నీటి విడుదల ప్రక్రియను పర్యవేక్షించడానికి సిబ్బందిని పంపించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
సభ్యులంతా హాజరు కావాలన్న బోర్డు..
ఏపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు ఈ నెల 4న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, సభ్యులందరూ హాజరు కావాలని ఇరు రాష్ట్రాలను కోరింది.
త్రిసభ్య కమిటీ కన్వినర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలు వ్యహరించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలతోపాటు నీటి విడుదల ఆర్డర్ల జారీపై ఈ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ఏప్రిల్, మేలలో తాగునీటి సరఫరాకు సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని పంపుల ద్వారా తరలించాలని ఇప్పటికే తెలంగాణ నిర్ణయం తీసుకుంది.
‘42.39 టీఎంసీలను తెలంగాణ వాడేసుకుంది’
శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి తమ రాష్ట్రానికి 45 టీఎంసీలు కేటాయించగా తాము 42.457 టీఎంసీలనే వినియోగించుకున్నామని... కానీ తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయిస్తే 7.391 టీఎంసీలు అధికంగా మొత్తం 42.391 టీఎంసీలను వాడుకుందని ఏపీ ఆరోపించింది. ఏపీలో తాగునీటికి తీవ్ర కొరత ఉన్నందున పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నెల 8 నుంచి నీటి విడుదలకు అనుమతించాలని కోరింది. ఏపీ ఆరోపణలకు బదులిస్తూ త్వరలో తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాయనుంది.
Comments
Please login to add a commentAdd a comment