సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగిన రీతిలోనే ఖజానా నిండింది. ప్రారంభ మాసమైన ఏప్రిల్‌లో దాదాపు రూ. 10 వేల కోట్లకు ప్రభుత్వ పద్దు చేరింది. ఇందులో రెవెన్యూ రాబడి రూ. 8 వేల కోట్లు కాగా, అప్పులు రూ. 1,900 కోట్లు కలిపితే ఆ మేరకు ఖజానా కళకళలాడిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు చెబుతున్నాయి.
ఇందులో పన్ను ఆదాయం రూపంలో రూ. 7,600 కోట్లకుపైగా రాగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నేతర ఆదాయం కలిపి మొత్తం రెవెన్యూ రాబడులు రూ. 8,050 కోట్లకు చేరాయి. జీఎస్టీ కింద తొలి మాసంలో రూ. 3 వేల కోట్లకుపైనే సమకూరగా రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 700 కోట్లు దాటింది. ఎప్పటిలాగే రూ. 1,000 కోట్లకుపైగా ఎక్సైజ్ ఆదాయం రాగా, అమ్మకపు పన్ను కూడా రూ. 2 వేల కోట్ల వరకు వచ్చింది. అయితే కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కలిపి కేంద్రం నుంచి సుమారు రూ. 750 కోట్లు మాత్రమే అందాయి. గతేడాది ఏప్రిల్‌లో కరోనా విజృంభణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆ నెల మొత్తం కలిపి ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ ఆదాయం కేవలం రూ. 3,377 కోట్లుకాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో మాత్రం రూ. 8 వేల కోట్లు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment