మాదాపూర్ (హైదరాబాద్): తెలంగాణ ప్రాంతం గతంలో వైద్య, ఆరోగ్య రంగంలో 14వ స్థానంలో ఉండగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 3వ స్థానంలోకి చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నియమితులైన ఆశా కార్యకర్తలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన 1,560 మంది ఆశా కార్యకర్తలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
ఒక్కో ఆశా వర్కర్‌పై రూ.50 వేలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి.. ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు ఈనెల నుంచి సెల్‌ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వ మే చెల్లిస్తుందని చెప్పారు. కొత్తగా వచ్చిన వారికి కూడా స్మార్ట్‌ఫోన్‌లను అందజేసి వారి బిల్లులను చెల్లిస్తామని తెలిపారు. దే శంలో ఆశా వర్కర్లకు అత్యధిక వేతనం తెలంగాణలోనే ఇస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం వారికి రూ.9,900 చెల్లిస్తున్నామని, గతంలో వేతనం పెంచమని అడిగితే.. గుర్రాలతో తొక్కించి, అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్‌లలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. అలాగే సెకండ్ ఏఎన్‌ఎంలకు రాష్ట్రంలో రూ.27 వేలకు పైగా వేతనం అందిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత వేతనం ఇవ్వడం లేదన్నా రు. బస్తీ దవాఖానాల ఏర్పాటువల్ల ఉస్మానియాలో 60 శాతం ఓపీ భారం తగ్గిందన్నారు.
అలాగే గాంధీ ఆస్పత్రిలో 56 శాతం, ఫీవర్ ఆస్పత్రిలో 72 శాతం ఓపీ భారం తగ్గిందన్నారు. గర్భిణుల కోసం 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కోర్టు కేసు తేలగానే ఉస్మానియా ఆస్పత్రికి అధునాతన భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment