
సాక్షి, వేములవాడ: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల కాల్పుల అనంతరం రాష్ట్రంలో విస్తృత తనిఖీలు చేపడుతున్న సమయంలో టిఫిన్ బాక్స్ బాంబు వెలుగులోకి వచ్చింది. దీంతో సిరిసిల్ల జిల్లాలో కలకలం ఏర్పడింది. కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ బాంబు బయటపడింది. ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని సురక్షితంగా టిఫిన్ బాక్స్ బాంబును వెలికితీశారు. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయేమోనని పోలీసులు ఆ ప్రాంతాన్ని జేసీబీతో తవ్వించారు. ప్రస్తుతం ఒక టిఫిన్ బాక్స్ బాంబు మాత్రమే బయటపడింది. దాన్ని నిర్వీర్యం చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
రాజన్న సిరిసిల్ల - నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిమడ్ల, మానాల అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులు, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతం. అప్పట్లో నక్సలైట్లు ఈ టిఫిన్ బాక్స్ బాంబును పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు వెలికితీసిన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ బృందం సభ్యులు ఆ ప్రాంతంలో క్షుణ్నంగా తనిఖీ చేపట్టారు. ఎక్కడ ఎలాంటి మందుపాతరలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక టిఫిన్ బాక్స్ బాబు బయటకు కనిపించడం అటవీశాఖ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం దానిని నిర్వీర్యం చేసే పనిలో పోలీసులు ఉన్నారు. బయటపడ్డ టిఫిన్ బాక్స్ బాంబుపై పోలీసులు విచారణ చేపట్టారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల నేపథ్యంలో తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ బాక్స్ బాంబు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment