మూడు రోజుల క్రితం కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై చెరుకు లోడు ట్రాక్టర్ ను ఢీకొన్న గరుడ ప్లస్ బస్సు
సాక్షి, హైదరాబాద్: వరుసపెట్టి జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఆ సంస్థను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుశిక్షితులైన డ్రైవర్లు ఉండి కూడా ప్రమాదాలు చోటు చేసుకోవడం అధికారులను కలవరబెడుతోంది. ప్రమాదాల నివారణపై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించింది. వాస్తవానికి ప్రైవేటు వాహన డ్రైవర్లతో పోలిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వద్ద మంచి నైపుణ్యం ఉంటుంది.
డ్రైవర్‌గా విధుల్లో చేరేటప్పుడు మంచి శిక్షణ పొందటమే కాకుండా, తరచూ పునఃశ్చరణ తరగతులు, డిపోల్లో గేట్ మీటింగ్స్ ద్వారా వారికి ప్రత్యేక సూచనలు అందుతుంటాయి. ఫలితంగా ఆర్టీసీ బస్సులు అతి తక్కువ ప్రమాదాలకు గురవుతుంటాయి. ఎదుటి వాహనాల తప్పిదం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ దీనికి భిన్నంగా ఇటీవల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆదాయంపైనే శ్రద్ధ.. కొరవడిన నిఘా
కొంతకాలంగా ఆర్టీసీ తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆదాయం పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇది డ్రైవర్లపై ప్రభావం చూపుతోంది. గతంలో నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్నవారిని, ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించి ప్రత్యేక సిబ్బంది సూచనలు చేసేవారు. డ్రైవర్లపై నిఘా ఉండేది.
ఆదాయం పెంచుకునే క్రమంలో కొంతకాలంగా ఈ కసరత్తు గతి తప్పింది. డ్రైవర్ల డ్యూటీల విషయంలోనూ చోటుచేసుకున్న మార్పులు వారిలో ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇటీవల వరంగల్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డుపక్కన నిలిచిఉన్న మరో ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీకొంది. పట్టపగలే ఈ ప్రమాదం జరగటం ఆర్టీసీ అధికారులను విస్మయానికి గురిచేసింది. అప్పటికే ఆ డ్రైవర్ డబుల్ డ్యూటీ చేసి విశ్రాంతి లేకుండా మరో డ్యూటీకి వచ్చాడని గుర్తించినట్టు తెలిసింది.
12 ఏళ్లుగా నియామకాలు లేవు..
ఆర్టీసీలో 2010 తర్వాత డ్రైవర్ నియామకాలు జరగలేదు. 12 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరినవారే కొనసాగుతున్నారు. దీంతో యువ డ్రైవర్ల కొరత ఉంది. కొంతమంది సీనియర్ డ్రైవర్లకు అనారోగ్య కారణాలు, త్వరగా అలసిపోవటం, నిద్రను నియంత్రించుకోలేకపోవటం లాంటి సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. ఇక కొన్ని డిపోల్లో డ్రైవర్లకు సెలవులు దొరకటం లేదన్న ఫిర్యాదులున్నాయి. డ్యూటీ–డ్యూటీకి మధ్య ఉండాల్సిన విరామం సరిగా పాటించటం లేదని, వరస డ్యూటీలతో అలసిపోయే డ్రైవర్లు ఏమరపాటుగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్న వాదనలున్నాయి.
ప్రత్యేక శిక్షణ అవసరం..
మూడు రోజుల క్రితం వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ హైదరాబాద్– బెంగుళూరు గరుడ ప్లస్ బస్సు అతి వేగంగా వెళ్తూ ఓ చెరుకులోడు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చే లోడు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తప్పించే విషయంలో డ్రైవర్లకు మరింత శిక్షణ అవసరమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
చలికాలం సూచనలు జారీ..
పొగమంచు ఆవహిస్తున్నందున డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. పొగమంచు ఉన్నప్పుడు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, ఎదుటి వాహనాలను గమనిస్తూ ఉండటం, ఓవర్‌టేకింగ్స్‌తో జాగ్రత్తలు, మంచు లైట్లు, ఇండికేటర్లు, వైపర్ల వినియోగం, అవసరమైతే రోడ్డుపక్కన ఆపేసి మంచు తగ్గాక వెళ్లటం, సెంట్రల్ లైనును దాటకపోవటం, రాంగ్‌రూట్లో వెళ్లకపోవటం, విధిగా డ్రైవర్లు అర్ధరాత్రి–తెల్లవారుజాము సమయాల్లో నిద్ర తేలిపోయేలా నీటితో మొహం కడుక్కోవటం, డ్యూటీకి వచ్చే ముందు సరైన విశ్రాంతి తీసుకోవటం లాంటి అంశాలపై సూచనలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment