సాక్షి,మధిర: మండలంలోని బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన కొట్టె మురళీకృష్ణ(26) గుండెపోటుకు గురై గురువారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందాడు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన కొట్టె కృష్ణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మురళీకృష్ణ ఉన్నారు. కృష్ణ తాపీ మేస్త్రీగా, రాధ కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించారు. ఇక మురళీకృష్ణ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ ఉద్యోగిగా చేస్తూ ఇటీవల శిక్షణ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. పదిహేను రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లిన ఆయన ఈనెల 13న కొత్త కంపెనీలో చేరాల్సి ఉండడంతో 11వ తేదీన వస్తానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు.
ఈక్రమంలో గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి కారులో సినిమాకు వెళ్లి వస్తుండగా మురళీకృష్ణ ఛాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలాడు. దీంతో స్నేహితులు ఆయనకు సీపీఆర్ చేస్తూనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు తెలిపారు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురాగా, జీవితంలో స్థిరపడుతూ తమను మంచిగా చూసుకుంటానని చెప్పే ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment