ఆటోమెటిక్‌ తలుపులు..ఆధునిక టాయ్‌లెట్లు | There are many special features in Sleeper Vande Bharat | Sakshi
Sakshi News home page

ఆటోమెటిక్‌ తలుపులు..ఆధునిక టాయ్‌లెట్లు

Published Wed, Sep 11 2024 3:34 AM | Last Updated on Wed, Sep 11 2024 3:34 AM

There are many special features in Sleeper Vande Bharat

త్వరలో పరుగులు తీయనున్నస్లీపర్‌ వందేభారత్‌లో ప్రత్యేకతలెన్నో

వెయ్యి కి.మీ.మించిన దూరం మధ్య తిరిగేందుకు సిద్ధం  

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్‌ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్‌ బెర్తులతో కూడిన వందేభారత్‌ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. 

ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. 

ప్రత్యేకతలు ఇవే.. 
» స్లీపర్‌ వందేభారత్‌ రైలును ఆస్టెనిటిక్‌ స్టెయిన్‌లెస్‌ స్టీలుతో రూపొందించారు. వందేభారత్‌ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్‌ డిజైన్‌తో కనువిందు చేస్తోంది. 
»  ఇంటీరియర్‌ను జీఎప్‌ఆర్‌పీ ప్యానెల్‌తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్‌ పాంట్రీ ఉంటుంది.  
»  అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్‌–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. 
»  దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు.  »  ఆటోమేటిక్‌ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్‌ ఆధారిత ఇంటర్‌ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. 
»  దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్‌లెట్లను అందుబాటులోకి  తీసుకొచ్చారు. 
»  లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 
»  మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్‌ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 
»  కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్‌ లైట్లు, యూఎస్‌బీ చార్జింగ్‌ వసతి ఉంటుంది.  
»  అనౌన్స్‌మెంట్‌ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది.  
»  ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్‌   ఉంటుంది. 
»  సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో  ఉంటుంది.  

మొత్తం 16 కోచ్‌లు.... 
ఈ ఆధునిక స్లీపర్‌ వందేభారత్‌ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్‌ కోచ్‌లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్‌ కోచ్‌లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్‌ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. 

మిడిల్‌ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్‌ బెర్తులు గ్రే కలర్‌లో ఉంటాయి. అప్పర్‌ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్‌ బ్యాగు, మొబైల్‌ ఫోన్‌ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement