వ్యవసాయ బావి వద్ద మృతి చెందిన కుక్క
చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని బానుబోళ్లు గుట్టల సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్ద పులి రెండు కుక్కలను చంపిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రామ్మూర్తి అనే రైతు రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. తన మొక్కజొన్న చేను వద్ద కాపలా కోసం రాత్రి పూట అక్కడే కుక్కలను వదిలి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం బావి వద్దకు వెళ్లగానే రెండు కుక్కలు మృతి చెంది కనిపించాయి.
దీంతో కుక్కలను పరిశీలించగా.. కుక్కలను వెంటాడి చంపినట్టు కాకుండా.. రక్తం పీల్చుకుని చంపినట్లు ఆనవాళ్లున్నాయని రైతు తెలిపాడు., నక్కలు తిని ఉంటే అలా ఉండదని, ఏదైనా క్రూర జంతువు కుక్కలను చంపి తిన్నదా..? అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. పులి మాదిరిగానే సంచరించిన అడుగుల ఆనవాళ్లున్నాయని చుట్టుపక్కల రైతులు తెలిపారు.
అటవీ శాఖాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై బీట్ ఆఫీసర్ వీరాసింగ్‌ను వివరణ కోరగా.. గుట్టల్లో జంగు పిల్లి తిరుగుతూ ఉండవచ్చని తెలిపారు. పులి గోర్లు అలా ఉండవని, రైతులు, గ్రామస్తులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment