సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగపప్పు (చనా) వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజాపంపిణీ సంస్థ ‘భారత్ దాల్‘ బ్రాండ్ పేరుతో ప్యాక్ అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం వద్ద ఉన్న శనగపప్పు స్టాక్‌లో 20 శాతం రిటైల్ సరఫరాగా మార్చి సబ్సిడీ ధరలకు అందించనుంది. ఈ మేరకు వన్ నేషన్ వన్ ప్రైస్ ధరలను అమలు చేస్తోంది. కిలో కేజీ శనగపప్పు ప్యాకెట్ రూ.60, 30 కిలోల ప్యాకెట్‌కు కిలోకు రూ.55 చొప్పున రూ.1,650కి అందించనున్నారు.
హాకాకు 50 వేల టన్నులు..
ఇక దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ‘భారత్ దాల్‘ బ్రాండ్ శనగపప్పు పంపిణీ బాధ్యతలను రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు అప్పగించింది. రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులకు, ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), మెట్రో, రిలయన్స్, టాటా రిటైల్ చైన్ హైపర్ మార్కెట్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ వంటి ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు హాకా నేరుగా సరఫరా చేయనుంది.
రేపు అధికారికంగా ప్రారంభం
హాకా పంపిణీ చేసే శనగపప్పు భారత్ దాల్ బ్రాండ్‌ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. నెక్లెస్‌రోడ్‌లో ని అంబేడ్కర్ విగ్రహం వద్ద హాకాచైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment