ఉప్పల్ : ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని జెన్‌ప్యాక్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్‌పై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంతో స్థానికులు, వాహనచోదకులు ఉలిక్కిపడ్డారు. ప్రమాద దృశ్యాలను చూసిన వాళ్లు ఎవరైనా భారీ ప్రాణనష్టమే జరిగి ఉంటుందని భావించారు. ప్రతి ఏడాదీ నూతన సంవత్సరం ప్రారంభ రోజైన జనవరి 1న ఈ దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ దేవాలయానికి ప్రమాదం జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి.
ఇన్నర్ రింగ్ రోడ్‌లో సికింద్రాబాద్–ఉప్పల్ రూట్‌లో ఉండే ఈ గుడి వరకు రోడ్డు విశాలంగా ఉంటుంది. దీని దగ్గర రెండుగా చీలి దేవాలయం దాటిన తర్వాత మళ్లీ కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మితిమీరిన వేగంతో వచ్చిన భారీ వాహనం దేవాలయ ప్రాంగణాన్ని నేరుగా ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇనుప ఆర్చ్‌తో పాటు ఓ చెట్టు కూలిపోయింది. దీంతో పరిపాలన కమిటీ దేవాలయం ముందు వద్ద ప్రమాదాలకు తావు లేకుండా కొన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈసారి పక్కగా వచ్చిన వాహనాలు గుడి గోడలు, పరిపాలన విభాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి.
కాగా నిత్యం దీన్ని ఉదయం 5.30 నుంచి 6.00 గంటల మధ్యే తెరుస్తారు. అయితే శుక్రవారం అర్చకులు రావడం కాస్త ఆలస్యం కావడంతో ప్రమాదం జరిగే సమయానికి దేవాలయం తెరుచుకోలేదు. అలా కాకుండా యథావిధిగా తెరుచుకుని ఉంటే భక్తులు, అర్చకులు, ఉద్యోగులతో పాటు పరిపాలన కమిటీకి చెందిన వారికీ ముప్పు వాటిల్లేది.
భారీగా నిలిచిన ట్రాఫిక్...
తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాలు దేవాలయం కుడిపక్క మార్గంలో ఉండిపోవడంతో ఆ రూట్‌ను బ్లాక్ చేశారు. ఘటనాస్థలి నుంచి వాహనాలను పక్కకు తీసేసరికి ఉదయం 10.30 గంటలు దాటింది. అప్పటి వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి నెమ్మదిగా కదిలింది.
ఈ రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఉప్పల్–సికింద్రాబాద్ రోడ్డులోనూ ప్రమాదానికి గురైన వాహనాలు, దేవాలయాన్ని చూడటానికి అనేక మంది ఆగిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. అధికారులు వాహనాలను క్లియర్ చేసినా.. అనేక మంది సాయంత్రం వరకు ఆ స్పాట్‌లో ఆగి వెళ్తుండటంతో ట్రాఫిక్ నెమ్మదిగానే సాగింది. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సందర్శన ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు ప్రవీణ్ రాజ్‌లు వచ్చి ప్రమాద తీవ్రతను చూసి చలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అప్పుడే వెనక్కి వెళ్లా..
వాచ్‌మెన్‌ని కావడంతో రాత్రంతా గుడిలోనే ఉన్నా. తెల్లవారుజామున లేచి దేవాలయం పరిసరాలను శుభ్రం చేశా. స్నానం చేసి వచ్చి అప్పటి వరకు పరిపాలన విభాగం సమీపంలోనే కూర్చున్నా. వస్త్రాలు ఆరేయడానికి వెనక్కు వెళ్లా. వెనుక నుంచి భారీ శబ్ధాలు రావడంతో పాటు డీసీఎం ఆలయ ప్రాంగణంలోకి దూసుకువచ్చింది. మినీ ట్రాన్స్‌ఫార్మర్‌తో కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి పరిపాలన విభాగంలోకి వెళ్లింది. కరెంట్ తీగలు తెగి నాపైన పడ్డాయి. అయితే అప్పటికే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రమాదం జరగలేదు.
– కృష్ణ, వాచ్‌మెన్
ఆ స్వామి దయవల్లనే బతికాం
ప్రతి రోజు పూజలు చేయడానికి ఉదయం 5.30 గంటల కల్లా ఆలయంలో ఉండే వాళ్లం. నూతన సంవత్సరం కావడంతో శుక్రవారమూ తెల్లవారు జామునే నిద్ర లేచాం. ఆలయానికి రావడానికి సిద్ధమయ్యాం. ఎందుకో కాస్త ఆలస్యమైంది. ఇంతలోనే ప్రమాద విషయాన్ని వాచ్‌మెన్ ఫోన్ చేసి చెప్పాడు. రోజు పూజలు చేయించుకునే ఆ దేవుడే మమ్మల్ని కాపాడారు.
– ప్రధాన అర్చకుడు రవీంద్ర శర్మ
Comments
Please login to add a commentAdd a comment