సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో అప్పటి టీఆర్‌ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఢిల్లీ పెద్దలను కదిలించింది. దీక్షను అడ్డుకొన్న అప్పటి రోశయ్య ప్రభుత్వం ఆయనను ఖమ్మం జైలుకు, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించినా దీక్ష ఆగలేదు. 11 రోజులపాటు సాగిన కేసీఆర్ దీక్ష నేపథ్యంలో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం డిసెం బర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఇదంతా కేసీఆర్ దీక్షాదక్షతలతోనే సాధ్యమైందంటున్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా ‘దీక్షాదివస్’జరుపుకున్నారు.
దీక్షా దివస్‌పై మంత్రుల ట్వీట్
నవంబర్ 29 దీక్షాదివస్‌ను రాష్ట్ర మంత్రులు భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ‘‘దీక్షా దివస్’నాకెంతో గర్వకారణమైన రోజు. నన్ను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. నాటి ఆందోళల నుంచి నేడు పరిపాలన దాకా... ఉద్యమం ఎన్నో అద్భుతమైన మలుపులు తిరిగింది. అంతటా వెన్నంటి నిలబడ్డ తెలంగాణ ప్రజలకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు’’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వరంగల్ ఫొటోనూ షేర్ చేశారు. ఇక మంత్రి హరీశ్‌రావు... ‘‘తెలంగాణ మలి ఉద్యమంలో 29కి ప్రత్యేకస్థానం ఉంది. రాష్ట్ర సాధనకోసం అలుపెరుగనిపోరాటం చేసిన ఉద్యమనేత కేసీఆర్. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి ఉక్కు సంకల్పాన్ని చాటిచెప్పిన రోజు’’అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆస్పత్రిలో కేసీఆర్ దీక్ష... సిద్ధిపేటలో తన దీక్ష, అరెస్టులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసి ఆ రోజును గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment