టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గులాంగిరికి వేసినట్లే | Telangana bjp leaders blamed on trs party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గులాంగిరికి వేసినట్లే

Published Fri, Mar 8 2019 12:46 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

Telangana bjp leaders blamed on trs party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే గులాంగిరికి ఓటు వేసినట్లేనని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు కల్వకుంట్ల కుటుంబానికి గులాంగురి చేసేందుకు ఉపయోగపడుతారు తప్ప రాష్ట్రానికి ఒరిగేదేముండదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే నెహ్రూ కుటుంబానికి ఓటేసినట్లేనని, ఈ రెం డు పార్టీల నుంచి గెలిచే ఎంపీలు ఆ రెండు కుటుంబాలకే గులాంగిరీ చేస్తారన్నారు. బీజేపీకి ఓటేస్తే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని, అది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటేసినట్లు అవుతుందని చెప్పారు. ఈ ఎన్నిక లు దేశభవిష్యత్‌కు సంబంధించినవని,  ప్రజలు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 16 సీట్లు గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో చెప్పే ధైర్యం కేటీఆర్‌కు ఉందా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ప్రధాని గా మోదీ కావాలని కోరుకుంటున్నారని.. ఆ విశ్వాసాన్ని ప్రజల్లో మోదీ కల్పించారన్నారు.  

దేశసేవకులా.. కుటుంబాలకు బానిసలా
పాకిస్తాన్‌కు పట్టిన దయ్యాన్ని వదిలించిన ఘనత మోదీదేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశానికి సేవకులు కావాలా.. కుటుంబాలకు బానిసలు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. బుధవారం కేటీఆర్‌ సభ కోసం విద్యార్థులను ఎండలో రోడ్లపై నిలబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లేనని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంకా బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని, ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు పేర్లతో జాబితా పంపమని కేంద్ర పార్టీ కోరిందన్నారు. పార్లమెంట్‌ క్లస్టర్ల సమావేశం తరువాత భేటీ అయి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లతో జాబితా తయారు చేసి పంపిస్తామన్నారు.  

ఒకరు పాల్‌.. మరొకరు చంద్రబాబు 
ఆంధ్రాలో ఇద్దరు గొప్ప నాయకులు మాట్లాడుతున్నారని, అందులో ఒకరు కేఏ పాల్‌ అయితే మరొకరు ఏపీ సీఎం చంద్రబాబని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారన్నారు. రాఫెల్‌ విషయంలో విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇంత వరకు ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదన్నారు. ఓట్ల గల్లంతు రెండు రాష్ట్రాలకు సంబంధించిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement