TRS partys
-
మునుగోడులో గోల్ కొట్టేదెవరు..? కాంగ్రెస్,టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు...
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడులో టికెట్ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసూ్తనే ఉన్నారు. ఆ రెండు పార్టీలు సర్వేలు చేయిస్తున్నందున చివరికి టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీ అభ్యర్థి విషయంలో స్పష్టత ఉన్నా మిగతా రెండు ప్రధాన పార్టీల్లో ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు ఆయా పార్టీల్లో టికెట్ ఆశిస్తున్నవారు బయటికి కలిసి తిరుగుతున్నా అంతర్గతంగా అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ఉప ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోగలిగితే రాజకీయ ఎదుగుదలకు మార్గం మరింత సుగమం అవుతుందనే ఆలోచనతో పలువురు ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు టికెట్ సంపాదిస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని, అధిష్టానం దృష్టిలో ఉంటామన్న ఆలోచనతో వేగంగా పావులు కదుపుతున్నారు. అలకలు.. బుజ్జగింపులు టీఆర్ఎస్ అధిష్టానం ప్రాథమికంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే పోటీలో నిలిపే ఆలోచన చేసింది. నియోజకవర్గంలోని పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా తమకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు పంపారు. మరోవైపు.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బందులపాలు చేశారని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఇటీవల నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖలు రాశారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులను హైదరాబాద్‌కు పిలిపించుకొని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. అధిష్టానం టికెట్ ఇచ్చిన వారికి సపోర్టు చేయాలని బుజ్జగించారు. అప్పుడు సరేనన్న నేతలు కొంతమంది ఆ తరువాత రెండు రోజులకే మల్కాపూర్‌లో సమావేశమై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. దీంతో టీఆర్ఎస్లో అసమ్మతి పూర్తిగా చల్లారలేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అధిష్టానం చేయిస్తున్న సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ప్రకటించనుంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేశారు. తమ గాడ్ ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే కర్నాటి విద్యాసాగర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే నారబోయిన రవి, బొల్లా శివకుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సన్నిహితంగా ఉండే డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డే! మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన ఈ నెల 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దీంతో ఆయనే బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. పైగా బీజేపీలో ఇంతవరకు తమకు టికెట్ కావాలని ఎవరూ అడిగిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి.. కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పాల్వాయి స్రవంతితోపాటు పున్న కైలాస్నేత, డాక్టర్ చెరుకు సుధాకర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగడంతో.. ముందునుంచి పార్టీలో ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
ఊపిరి పణంగా.. ఉద్యమం ఉధృతంగా..
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో అప్పటి టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఢిల్లీ పెద్దలను కదిలించింది. దీక్షను అడ్డుకొన్న అప్పటి రోశయ్య ప్రభుత్వం ఆయనను ఖమ్మం జైలుకు, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించినా దీక్ష ఆగలేదు. 11 రోజులపాటు సాగిన కేసీఆర్ దీక్ష నేపథ్యంలో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం డిసెం బర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఇదంతా కేసీఆర్ దీక్షాదక్షతలతోనే సాధ్యమైందంటున్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా ‘దీక్షాదివస్’జరుపుకున్నారు. దీక్షా దివస్‌పై మంత్రుల ట్వీట్ నవంబర్ 29 దీక్షాదివస్‌ను రాష్ట్ర మంత్రులు భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ‘‘దీక్షా దివస్’నాకెంతో గర్వకారణమైన రోజు. నన్ను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. నాటి ఆందోళల నుంచి నేడు పరిపాలన దాకా... ఉద్యమం ఎన్నో అద్భుతమైన మలుపులు తిరిగింది. అంతటా వెన్నంటి నిలబడ్డ తెలంగాణ ప్రజలకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు’’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వరంగల్ ఫొటోనూ షేర్ చేశారు. ఇక మంత్రి హరీశ్‌రావు... ‘‘తెలంగాణ మలి ఉద్యమంలో 29కి ప్రత్యేకస్థానం ఉంది. రాష్ట్ర సాధనకోసం అలుపెరుగనిపోరాటం చేసిన ఉద్యమనేత కేసీఆర్. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి ఉక్కు సంకల్పాన్ని చాటిచెప్పిన రోజు’’అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆస్పత్రిలో కేసీఆర్ దీక్ష... సిద్ధిపేటలో తన దీక్ష, అరెస్టులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసి ఆ రోజును గుర్తు చేసుకున్నారు. -
కేసీఆర్.. చేతకాకుంటే రాజీనామా చెయ్...
సాక్షి, హైదరాబాద్: యాసంగి వడ్లను కొనబోమని సీఎం కేసీఆర్ ప్రకటించడం దారుణమని, వడ్లు కొనడం చేతకాకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంపై నెపం నెట్టి రైతాంగాన్ని కాపాడే బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్రం కొనకపోతే రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగం పం డించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ రేపు ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర దీక్ష చేస్తే తాను మద్దతిచ్చి పాల్గొంటానని వెంకట్‌రెడ్డి చెప్పారు. చావు నోట్లో తల పెట్టి వచ్చానని చెప్పుకునే కేసీఆర్.. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే పోరాటమని, ఉత్తరాది రైతుల్లా పోరాటం చేయాలని కోరారు. ఓవైపు తెలంగాణ రైతులు రోడ్లపై పడే పరిస్థితుల్లో ఉంటే.. పక్కరాష్ట్రాల్లో భూములు కొంటున్నారని అనడం కేసీఆర్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. -
పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టిండ్రు..
సాక్షి, వీణవంక(కరీంనగర్): వీణవంక మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ పార్టీ ధూంధాం కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. నరసింహులపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగి లకోట నిరోష ఉద్యోగ ప్రకటనపై ప్రశ్నించగా.. నాయకులు, పోలీసులు ఆమెను సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై సోమవారం సదరు యువతి తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారని అడిగినందుకు అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్లు రూ.10 లక్షలు ఇచ్చి పంపించారా అంటూ బెదిరించినట్లు ఆరోపించింది. అక్కడి నుంచి వస్తుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొటట్టారని.. మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా పోయిందని చెప్పింది. చేతులు, కాళ్లు పట్టుకొని కదలనివ్వకుండా చేశారని.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తర్వాత కూడా మాట్లాడదామనుకుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. వారు కేసీఆర్‌కు తొత్తులుగా మారారంటూ వీడియోలో కంటతడి పెట్టింది. చదవండి: పచ్చని సంసారంలో కేసీఆర్ నిప్పు పెట్టారు -
టీఆర్ఎస్కు ఓటేస్తే గులాంగిరికి వేసినట్లే
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే గులాంగిరికి ఓటు వేసినట్లేనని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కుటుంబానికి గులాంగురి చేసేందుకు ఉపయోగపడుతారు తప్ప రాష్ట్రానికి ఒరిగేదేముండదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే నెహ్రూ కుటుంబానికి ఓటేసినట్లేనని, ఈ రెం డు పార్టీల నుంచి గెలిచే ఎంపీలు ఆ రెండు కుటుంబాలకే గులాంగిరీ చేస్తారన్నారు. బీజేపీకి ఓటేస్తే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని, అది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటేసినట్లు అవుతుందని చెప్పారు. ఈ ఎన్నిక లు దేశభవిష్యత్‌కు సంబంధించినవని, ప్రజలు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 16 సీట్లు గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో చెప్పే ధైర్యం కేటీఆర్‌కు ఉందా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ప్రధాని గా మోదీ కావాలని కోరుకుంటున్నారని.. ఆ విశ్వాసాన్ని ప్రజల్లో మోదీ కల్పించారన్నారు. దేశసేవకులా.. కుటుంబాలకు బానిసలా పాకిస్తాన్‌కు పట్టిన దయ్యాన్ని వదిలించిన ఘనత మోదీదేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశానికి సేవకులు కావాలా.. కుటుంబాలకు బానిసలు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. బుధవారం కేటీఆర్ సభ కోసం విద్యార్థులను ఎండలో రోడ్లపై నిలబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లేనని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని, ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు పేర్లతో జాబితా పంపమని కేంద్ర పార్టీ కోరిందన్నారు. పార్లమెంట్ క్లస్టర్ల సమావేశం తరువాత భేటీ అయి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లతో జాబితా తయారు చేసి పంపిస్తామన్నారు. ఒకరు పాల్.. మరొకరు చంద్రబాబు ఆంధ్రాలో ఇద్దరు గొప్ప నాయకులు మాట్లాడుతున్నారని, అందులో ఒకరు కేఏ పాల్ అయితే మరొకరు ఏపీ సీఎం చంద్రబాబని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారన్నారు. రాఫెల్ విషయంలో విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇంత వరకు ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదన్నారు. ఓట్ల గల్లంతు రెండు రాష్ట్రాలకు సంబంధించిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. -
‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ప్రలోభాలు’
సాక్షి, హైదరాబాద్: ఈవీ ఎంలను అడ్డం పెట్టుకుని, అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు ప్రజా తీర్పును సైతం అవహేళన చేస్తూ ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టే పనిలో పడిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చే రీతిలో ఆపరేషన్ ఆకర్‡్ష పేరుతో టీఆర్ఎస్ అకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ వెనువెంటనే వేటు వేశారని, అయితే కాంగ్రెస్, టీడీపీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి వివాదాలకు తావివ్వని రీతిలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. -
ఉద్యోగుల విరమణ వయసు పెరగనుందా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెరిగే అవకాశముంది. టీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ సైతం పదవీ విరమణ వయసును అరవై ఏళ్లకు పెంచేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం ఈ అంశానికి బలాన్నిస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. టీఆర్ఎస్ సైతం 60 లేక 61 ఏళ్లకు పెంచే అంశంపై మేనిఫెస్టోలో స్పష్టత ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశమై గురువారం ఆర్మూర్ బహిరంగసభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ సైతం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లు చేయాలా?, 61 ఏళ్లు చేయాలా? అన్న దానిపై మేనిఫెస్టో కమిటీలో నిర్ణయించి ప్రకటన చేస్తామని వెల్లడించడం ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కేశవరావుతో ఉద్యోగ సంఘాల భేటీ కాంగ్రెస్ మేనిఫెస్టో బహిర్గతమైన నేపథ్యంలో గురువారం ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావుతో భేటీ అయ్యారు. పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని విన్నవించారు. దీనిపై కేకే సైతం సానుకూలంగా స్పందించడంతోపాటు, జిల్లాల బహిరంగసభల్లో పాల్గొంటున్న సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ బహిరంగ సభలో కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మాట్లాడారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు దేశంలో ఎవరూ ఇవ్వనటువంటి ఫిట్మెంట్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత సుముచితమైన ఐఆర్, ఫిట్మెంట్ ఇస్తాం. వీటితోపాటు పదవీ విరమణ వయసు పెంచాలంటూ ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. గురువారం సైతం ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై కేకేను కలిసి వినతులు ఇచ్చారు. ఆ విషయంపై మేం తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నాం. పదవీ విరమణ వయసును 60 ఏళ్లు చేయాలా, 61 ఏళ్లు చేయాలా అన్న దానిపై కమిటీలో నిర్ణయం చేసి దీనిపై ప్రకటన చేస్తాం. దీనిలో ఎలాంటి గందరగోళం వద్దు’అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పదవీ విరమణ పెంపు అంశం కచ్చితంగా ఉంటుందని, అయితే 60 ఏళ్లకా లేక 61 ఏళ్లకా అన్నదానిపై అందులోనే స్పష్టత ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 60 ఏళ్లకు పెంచుతామని ప్రకటన చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి 61 ఏళ్లకు పెంచే అవకాశాలున్నాయని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదిఏమైనా రెండు ప్రధాన పార్టీలు పదవీ విరమణ వయసును పెంచుతామని స్పష్టం చేస్తుండటం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు పెంచుతోంది. ఏపీలో పెంపు.. రాష్ట్రంలో డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును పెంచాలన్న డిమాండ్ రాష్ట్ర విభజననాటి నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్‌సహా వివిధ రాష్ట్రాల్లో విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో 62 ఏళ్లకు పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ అంశంపై చర్చించి ప్రభుత్వం ముందు పెట్టింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని ప్రభుత్వం పేర్కొందని, ఇప్పటికైనా దానిని అమలు చేయాలని ఉద్యోగవర్గాలు కోరాయి. రెగ్యులర్‌గా నియామకాలు జరగని పరిస్థితుల్లో రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ప్రయోజనం ఉం టుందని విన్నవించాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం ఇదే అంశమై అన్ని ప్రధాన పార్టీలను కలిసిన ఉద్యోగ సంఘాలు, పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని విన్నవించాయి. మనిషి సగటు ఆయుః ప్రమాణం పెరిగిన నేపథ్యంలో, పదవీ విరమణ వయసును పెంచాల్సి ఉంటుందని ఉద్యోగులు విన్నవించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించి తన మేనిఫెస్టోలో పొందిపర్చింది. -
అభివృద్ధిని మరిచిన పాలకులు
లింగంపేట: స్వాతంత్య్ర వచ్చిన తర్వాత దేశంలో పేదల పెన్నిదిగా కాంగ్రెస్ పార్టీ అవతరించిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమడుగు సురేందర్ అన్నారు. ఆదివారం ఐలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 30 ఏళ్లు పాలించిన టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో శ్రద్ధ చూపలేదన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి జపం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అభివృద్ధిపై శ్రద్ధ చూపాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో 150 మంది చేరిక మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సురేందర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని వారికి భరోసా ఇచ్చారు. గ్రామంలోని ఆయా సంఘాలు, పార్టీలకు చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్, రాంరెడ్డి, నరహరి, ఖదీర్, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం కిష్టయ్య, రాజు, గోపీగౌడ్, నహీం, ఇమాం, ఫతీయోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల దీవెనలే ప్రభుత్వానికి అండ
ఇల్లంతకుంట : ప్రజల దీవెనలే కేసీఆర్ సర్కారుకు కొండంత అండగా ఉన్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని తిప్పాపూర్‌లో గ్రామపంచాయతీ, యాదవసంఘం, మహిళా సంఘ భవనాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఎస్సీ, మున్నూరుకాపు సంఘం, బస్టాండ్ భవనాలకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వేలాది కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం అమలు చేస్తుందని, కావాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ మంజుల, గుండ సరోజన, రాఘవరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సంధ్యారాణి, మల్లయ్య, శ్రీనివాస్, గొడుగు తిరుపతి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలుగుదేశం పార్టీలో తాజాగా చిచ్చుపెట్టిన అనుముల రేవంత్‌రెడ్డితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు ‘చేయి’ కలిపారు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని భావిస్తున్నప్పటికీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జోక్యం చేసు కుంటే పరిణామాల్లో కొంత మార్పు ఉంటుందేమోనని ఆ పార్టీ అభిమానులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన రేవంత్ వర్గం మళ్లీ వెనుదిరిగే అవకాశం లేదని సమాచారం.ఇది జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్‌లో కూడా టీడీపీకి కోలుకోలేని దెబ్బ. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసపోయిన నాయకులతో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఖాళీ అయిన టీడీపీ జిల్లాలో ఓ జ్ఞాపకంగా మిగిలే పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం అనుకూలంగా మలుచుకోలేక రోజురోజుకు నీరసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ గ్రూప్ చేరితే కొత్త ఉత్తేజం వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్టు కచ్చితంగా వస్తుందని భావిస్తున్న ముఖ్య నాయకులే ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కాగా, పోటీ చేసే అవకాశం లేని నాయకులు తెలుగుదేశాన్నే అంటిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల టీడీపీ అధ్యక్షులు బోడ జనార్దన్, సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతుండగా, నిర్మల్, కుమురం భీం జిల్లాల అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, జి.ఆనంద్ టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో కిందిస్థాయిలో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులుగా ఉన్న కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. రేవంత్‌కు అండగా మంచిర్యాల, ఆదిలాబాద్ నేతలు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డికి బాహాటంగానే మద్ధతు ప్రకటించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్న జనార్ధన్‌కు రేవంత్ రూపంలో అండ దొరికినట్లయింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జనార్ధన్ 2009 ఎన్నికల తరువాత నుంచే పార్టీలు మారుతూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ గడపలు తొక్కి తిరిగి 2014 ఎన్నికల తరువాత మాతృపార్టీ టీడీపీలోకి వచ్చారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కుమార్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గాడ్‌ఫాదర్ ఉంటే తప్ప అవకాశాలు రావని భావిస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు రేవంత్ ‘నీడ’ కలిసొచ్చినట్లయింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయానికొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. జనార్దన్‌తో పాటు ఇక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న దుర్గం నగేష్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ‘బోడ’ బాటలో సోయం బాపూరావు బోథ్ మాజీ శాసనసభ్యుడు సోయం బాపూరావు కూడా తెలుగుదేశం పార్టీని వీడి రేవంత్ వెంట కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ తరుపున 2004లో గెలిచిన ఆయన 2007లో పాస్‌పోర్టుల కుంభకోణంలో అరెస్టయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆయన టిక్కెట్టు కోల్పోగా, అప్పటి తెలుగుదేశం నేత గోడెం నగేష్ టీడీపీ–టీఆర్ఎస్ పొత్తుతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా ఉపయోగం ఉండదని భావిస్తున్న బాపూరావు రేవంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరి బోథ్ అసెంబ్లీ నుంచి గానీ, ఆదిలాబాద్ లోక్‌సభ నుంచి గాని పోటీ చేయాలన్న యోచనతో ఉన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి నుంచి తగిన హామీ పొందినట్లు సమాచారం. బోడ జనార్దన్, సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరికతో ఈ రెండు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ గూటికే చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మల్, కుమురంభీంలో యథాతథం ఉమ్మడి ఆదిలాబాద్‌లో రెండు జిల్లాల నేతలు రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండగా, నిర్మల్, కుమురంభీం జిల్లాల నుంచి పెద్దగా వలసలు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోనే ఈ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరగా, ఇటీవల మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కుటుంబం కారెక్కింది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా లోలం శ్యాంసుందర్, కుమరంభీం జిల్లా అధ్యక్షుడు జి.ఆనంద్ పార్టీలోనే కొనసాగనున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు జి.బుచ్చిలింగంకు జి.ఆనంద్ సోదరుడు. వీరు కాకుండా నిర్మల్ నాయకులు కోరిపల్లి భూషన్‌రెడ్డి, ఓం ప్రకాష్ లడ్డా ఎటువైపు వెళతారనేది తేలలేదు. -
మంత్రి పదవి చేపడతా
పాలకుర్తి: రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవి చేపడుతానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్ల నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ తాను ఇతర నియోజకవర్గాలకు వెళ్లిపోతానని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కష్టకాలంలో పాలకుర్తి ప్రజలు ఆదరించారన్నారు. పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకోవడానిఇక ఆశించిన విధంగా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో టెక్స్ టైల్ పార్కు నిర్మాణం శంకుస్థాపనకు వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీరు అందుబాటులోకి వస్తుండటంతో 90 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ముస్కు రాంబాబు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, వైస్ ఎంపీపీ గూడ దామోదర్, ఎంపీటిసిలు, సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విలీనంపై కేసీఆర్ డ్రామాలు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగట్టాలని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయకర్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణ యం తీసుకోవడం వల్లే కేంద్రంలో చల నం వచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్లో టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కు మ్మకై తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందన్నారు. సిగ్గు లేని కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వల్లే తెలంగాణ వస్తుందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే పార్టీని కాంగ్రెస్‌లో విలీ నం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విలీనంపై ఆయన డ్రామాలాడుతున్నారని ఆరోపిం చారు. కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్క రూ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా ఆభివృద్ధి గురించిఒక్కరోజైనా పార్లమెం ట్లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. తాండూరు ఎమ్యెల్యే మహేందర్‌రెడ్డి, ములుగు ఎమ్యెల్యే సీతక్క, నర్సంపేట ఎమ్యెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెం దిందని చెప్పారు. రాష్ట్రంలో ధ్రుతరాష్ట్ర పా లన సాగుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చంద్రబాబు విశేష కృషి చేశారని చెప్పారు. కానీ తమ వల్లే రాష్ట్రం ఏర్పడబోతోందని టీఆర్ఎస్, కాం గ్రెస్ నేతలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి మోసాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా ఎమ్యెల్యేలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పి.రాములు, జైపాల్ యాదవ్, దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు అన్నారు. సోనియా జపం చేస్తున్న కొందరు నాయకులు ఆమెకు గుడి కట్టిస్తామని చెప్పాడం చూస్తే నవ్వొస్తుందని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న శ్రీకాంతచారి, జిల్లాకు చెందిన సువర్ణతో పాటు ప్రొఫెసర్ జయశంకర్లకు గుడి కట్టించాలని సూచించారు. వచ్చేఎన్నికల్లో జిల్లాలో 14ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, ఎన్పీ వెంకటేశ్, నాగేశ్వర్‌రెడ్డి, జయశ్రీ, రాధిక, నాగేశ్వర్‌రెడ్డి, సమద్‌ఖాన్, పగిడాల శ్రీను కృష్ణమోహన్ పాల్గొన్నారు.