
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెరిగే అవకాశముంది. టీఆర్‌ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ సైతం పదవీ విరమణ వయసును అరవై ఏళ్లకు పెంచేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం ఈ అంశానికి బలాన్నిస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. టీఆర్‌ఎస్ సైతం 60 లేక 61 ఏళ్లకు పెంచే అంశంపై మేనిఫెస్టోలో స్పష్టత ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశమై గురువారం ఆర్మూర్ బహిరంగసభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ సైతం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లు చేయాలా?, 61 ఏళ్లు చేయాలా? అన్న దానిపై మేనిఫెస్టో కమిటీలో నిర్ణయించి ప్రకటన చేస్తామని వెల్లడించడం ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
కేశవరావుతో ఉద్యోగ సంఘాల భేటీ
కాంగ్రెస్ మేనిఫెస్టో బహిర్గతమైన నేపథ్యంలో గురువారం ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావుతో భేటీ అయ్యారు. పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని విన్నవించారు. దీనిపై కేకే సైతం సానుకూలంగా స్పందించడంతోపాటు, జిల్లాల బహిరంగసభల్లో పాల్గొంటున్న సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ బహిరంగ సభలో కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మాట్లాడారు. ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు దేశంలో ఎవరూ ఇవ్వనటువంటి ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత సుముచితమైన ఐఆర్, ఫిట్‌మెంట్ ఇస్తాం. వీటితోపాటు పదవీ విరమణ వయసు పెంచాలంటూ ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. గురువారం సైతం ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై కేకేను కలిసి వినతులు ఇచ్చారు. ఆ విషయంపై మేం తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నాం. పదవీ విరమణ వయసును 60 ఏళ్లు చేయాలా, 61 ఏళ్లు చేయాలా అన్న దానిపై కమిటీలో నిర్ణయం చేసి దీనిపై ప్రకటన చేస్తాం. దీనిలో ఎలాంటి గందరగోళం వద్దు’అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పదవీ విరమణ పెంపు అంశం కచ్చితంగా ఉంటుందని, అయితే 60 ఏళ్లకా లేక 61 ఏళ్లకా అన్నదానిపై అందులోనే స్పష్టత ఇస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 60 ఏళ్లకు పెంచుతామని ప్రకటన చేసిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఒక అడుగు ముందుకేసి 61 ఏళ్లకు పెంచే అవకాశాలున్నాయని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదిఏమైనా రెండు ప్రధాన పార్టీలు పదవీ విరమణ వయసును పెంచుతామని స్పష్టం చేస్తుండటం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు పెంచుతోంది.
ఏపీలో పెంపు.. రాష్ట్రంలో డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును పెంచాలన్న డిమాండ్ రాష్ట్ర విభజననాటి నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్‌సహా వివిధ రాష్ట్రాల్లో విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో 62 ఏళ్లకు పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ అంశంపై చర్చించి ప్రభుత్వం ముందు పెట్టింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని ప్రభుత్వం పేర్కొందని, ఇప్పటికైనా దానిని అమలు చేయాలని ఉద్యోగవర్గాలు కోరాయి. రెగ్యులర్‌గా నియామకాలు జరగని పరిస్థితుల్లో రిటైర్‌మెంట్ వయసు పెంచడం వల్ల ప్రయోజనం ఉం టుందని విన్నవించాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం ఇదే అంశమై అన్ని ప్రధాన పార్టీలను కలిసిన ఉద్యోగ సంఘాలు, పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని విన్నవించాయి. మనిషి సగటు ఆయుః ప్రమాణం పెరిగిన నేపథ్యంలో, పదవీ విరమణ వయసును పెంచాల్సి ఉంటుందని ఉద్యోగులు విన్నవించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించి తన మేనిఫెస్టోలో పొందిపర్చింది.