సాక్షి, హైదరాబాద్: సంతృప్తికర (శ్యాచురేషన్) స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలను కోరింది. అంటే కరోనా పరీక్షలు చేయించుకునే వారెవరూ లేరన్నంత వరకు చేయాలని స్పష్టం చేసింది. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. కీలకమైన చలికాలంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు గుమికూడే ప్రదేశాల్లో పరీక్షలను ముమ్మరం చేయాలని, ఎక్కడ, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై రాష్ట్రాలు వ్యూహం రచించుకోవాలని సూచించింది. పరీక్షకు నిధులు ఎలా సమకూర్చుకోవాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది.
గుమికూడే ప్రదేశాలపై దృష్టి
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, మార్కెట్లు తదితర ప్రజలు అధికంగా గుమికూడే ప్రదేశాలు కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని కేంద్రం తెలిపింది. ‘చాలాసార్లు కార్యాలయాల్లోని వ్యక్తులు సమాజంలోకి వైరస్‌ను మోసుకువస్తారు. లేదా తమ కుటుంబ సభ్యులకు అంటిస్తారు. ఇలా వీరు సూపర్ స్ప్రెడర్స్‌గా మారతారు. కార్యాలయాల ద్వారా పెద్దసంఖ్యలో ప్రజలు వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది. మార్కెట్లు తదితర ప్రాంతాలు కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో వైరస్‌ను గుర్తించడానికి సంతృప్తికర స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించడం వీలవుతుందని పేర్కొంది. (చదవండి: ‘వ్యాక్సిన్’ కోసం లక్షమంది వివరాలు..)
ర్యాపిడ్‌లో నెగెటివ్ వస్తే ఆర్‌టీపీసీఆర్
సామూహిక పరీక్షలు పూర్తయిన తరువాత నెగెటివ్ వచ్చిన వారిని కనీసం 5 – 10 రోజుల వరకు పరిశీలనలో ఉంచాలి. వారిలో లక్షణాలుంటే కొన్నిరోజులకు వైరస్ బయటపడుతుంది. అలా లక్షణాలున్న వారికి ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయాలి. విరివిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, కిట్లను, ఇతరత్రా సామగ్రిని సమకూర్చుకోవాలి. ఆ ప్రకారం సాధ్యమైనంత వరకు సంతృప్తికర స్థాయి వరకు పరీక్షలు చేయాలని కేంద్రం సూచించింది. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన సలహాలు, సాంకేతిక సహకారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీనిచ్చింది. (చదవండి: అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్!)
రాష్ట్రంలో రోజుకు లక్ష పరీక్షలు
చలికాలం నేపథ్యంలో తెలంగాణలో గణనీయసంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 40 వేలకు అటూఇటూగా పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించారు. ప్రజలు గుమికూడే ప్రదేశాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, మార్కెట్ల వద్ద కూడా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 ఆస్పత్రుల్లో, 310 మొబైల్ టెస్టింగ్ లేబొరేటరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. అలాగే 18 ప్రభుత్వ, 50 ప్రైవేట్ లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిల్లో మొత్తం కలిపి రోజుకు లక్ష వరకు పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఆదేశాలతో సంతృప్తికర స్థాయిలో పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఫ్లూ సీజన్.. జాగ్రత్త
ప్రస్తుతం చలికాలం కాబట్టి స్వైన్‌ఫ్లూ సహా సీజనల్ ఫ్లూ వ్యాధులు విజృంభిస్తాయి. అలాగే మున్ముందు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. చలికాలం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో చలితీవ్రత దృష్ట్యా జనవరి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర చోట్ల పరీక్షల నిర్వహణకు కార్యాచరణ ప్రారంభించాం. లక్షణాలున్నా లేకున్నా అవసరమైన వారికి పరీక్షలు చేస్తాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment