సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిరోజూ 65 వేలకు తగ్గకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రతి జిల్లాకు చేయాల్సిన పరీక్షల టార్గెట్‌ను విధించింది. నిర్దేశించిన పరీక్షల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 35 వేల నుంచి 40 వేల మధ్యే కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వస్తోన్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొవాలంటే విస్తృత పరీక్షలొక్కటే మార్గమని ఆయన తెలిపారు. వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు భారీగా టెస్టులు చేయాల్సి ఉందన్నారు. (ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు?)
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 కేంద్రాల్లో యాంటిజెన్, 18 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సామర్థ్యం రోజుకు 25 వేల వరకు ఉండగా, వాటిలో ప్రస్తుతం రోజుకు కనీసం 3 వేలు కూడా చేయడం లేదు. సిరిసిల్ల, నారాయణపేట్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లోనే రోజుకు వెయ్యి లోపు టార్గెట్ ఉండగా, మిగిలిన అన్ని జిల్లాల్లో సగటున 1,200–1,500 మధ్య టెస్టులు చేయాలని శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment