TS Inter Results 2023: Gurukul Colleges Better Than Govt Colleges - Sakshi
Sakshi News home page

గురుకులాలు భేష్‌.. ప్రభుత్వ కాలేజీలు డౌన్‌.. కార్పొరేట్‌ కాలేజీల కంటే దీటైన మార్కులు..

Published Wed, May 10 2023 7:52 AM | Last Updated on Wed, May 10 2023 11:10 AM

TS Inter Results 2023 Gurukulam Colleges Better Than Govt Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సంక్షేమ గురుకుల సొసైటీలు సత్తా చాటాయి. కార్పొరేట్‌ కాలేజీల కంటే దీటైన మార్కులను సొంతం చేసుకున్నాయి. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) నుంచి ఫస్టియర్, సెకండియర్‌లో అత్యధిక మార్కులు సొంతం చేసుకున్నారు. టాప్‌ 10లో సగం ర్యాంకులు ఈ సొసైటీకే సొంతమయ్యాయి.

మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే.. గురుకుల కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరిగితే.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మాత్రం తగ్గిపోయింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ కేవలం 40 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. రెండో ఏడాది కూడా 54 శాతమే పాసయ్యారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్‌) 92శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో నిలబడింది. వివిధ వర్గాలకు చెందిన గురుకుల కాలేజీల్లోనూ విద్యార్థులు ఎక్కువ మంది పాసయ్యారు.

కానీ మోడల్‌ స్కూళ్లలో మాత్రం ఫ్యాకలీ్టలోపం వల్ల ఉత్తీర్ణత శాతం 66కు మించలేదు. ప్రైవేటు కాలేజీల్లోనూ ఈసారి 63 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. రెసిడెన్షియల్‌ కాలేజీల తరహాలో ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. 

కార్పొరేట్‌కు దీటైన ఫలితాలివి: మంత్రి గంగుల
ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్‌ కాలేజీలకు దీటైన ఫలితాలను గురుకుల పాఠశాలలు సాధించాయి. బీసీ గురుకుల సొసైటీ నుంచి అద్భుతమైన ర్యాంకులు రావడం ఆనందకరం. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో మందమర్రికి చెందిన హరిత 468 మార్కులు సాధించి ఫస్ట్‌ ర్యాంకు కొట్టింది. ఇక సికింద్రాబాద్‌కు చెందిన భూమిక 467 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ఇంతటి అద్భుత పలితాలు సాధించిన సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. 

ఉన్నత అవకాశాల్లోనూ ముందే..: మంత్రి కొప్పుల 
ఉత్తమ ఫలితాల్లోనే కాకుండా ఉన్నత ఉద్యోగాలను చేజిక్కించుకుంటున్న వారిలో గురుకుల విద్యార్థులుంటున్నారు. ఈసారి ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గురుకులాలను నిర్వహిస్తున్నందున మంచి ఫలితాలు వచ్చాయి.  

పేదల విద్యకు ప్రాధాన్యత:మంత్రి సత్యవతి రాథోడ్‌ 
రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో తెరిచి పేదలకు కేజీ టు పీజీ విద్య అందించే లక్ష్యాన్ని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా గురుకులాలు రికార్డులు సాధిస్తున్నాయి. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నందునే గురుకులాల విద్యార్థులు కార్పొరేట్‌ కాలేజీల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.
చదవండి: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement