మీడియం ప్రాజెక్టులకూ రుణాలే..! | TS Medium Irrigation Projects Will Be Complete With Loans | Sakshi
Sakshi News home page

మీడియం ప్రాజెక్టులకూ రుణాలే..!

Published Fri, Mar 5 2021 3:53 AM | Last Updated on Fri, Mar 5 2021 3:53 AM

TS Medium Irrigation Projects Will Be Complete With Loans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరహా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. నిధుల్లేక నత్తనడకన సాగుతున్న వీటి పనులను పరుగెత్తించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని భారీ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా కార్పొరేషన్ల ద్వారా రుణాల సేకరణ చేస్తున్న ప్రభుత్వం మధ్య తరహా (మీడియం) సాగునీటి ప్రాజెక్టులకు కూడా రుణాలు సేకరించాలని నిర్ణయించింది. మీడియం ప్రాజెక్టులను రుణాలతోనే గట్టెక్కించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సదర్‌మట్, కుఫ్టి, చనాకా-కొరట, కొమురంభీం, పెద్దవాగు ప్రాజెక్టుల కోసం రుణాల సేకరణకు కసరత్తు ఆరంభించింది. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే వీటికి రుణాలు సేకరించనుంది.

రూ.1,500 కోట్ల మేర సేకరణ యత్నాలు
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా రుణాలే ఆదుకుంటున్నాయి. ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ద్వారా రూ.91 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.76 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలోంచే రూ.42 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.34 వేల కోట్లు లభ్యతగా ఉన్నాయి. ఇదే కార్పొరేషన్‌ ద్వారా మరో భారీ ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డికి సైతం రుణాలు తీసుకున్నారు. దీని కోసం రూ.6,160 కోట్ల మేర రుణాలు తీసుకోగా ఇందులో రూ.500 కోట్ల వరకు ఖర్చు చేశారు. సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం, వరదకాల్వ ప్రాజెక్టులకు కలిపి మరో కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రూ.17 వేల కోట్లు రుణాలు తీసుకోగా ఇందులో రూ.9 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ప్రాజెక్టుల పనులు ముందుకు కదులుతున్నాయి. అయితే, మధ్యతరహా ప్రాజెక్టులను మాత్రం నిధులకొరత పీడిస్తోంది.

ముఖ్యంగా చనాకా-కొరట పనులను రూ.795 కోట్లతో చేపట్టినా రూ.500 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక సదర్‌మట్‌ బ్యారేజీలోనూ ఇప్పటివరకు రూ.520 కోట్లు వెచ్చించగా రూ.220 కోట్ల మేర పనులు మిగిలి ఉన్నాయి. కుఫ్టి ఎత్తిపోతలకు ఇటీవలే రూ.794 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. కొమురంభీం ప్రాజెక్టు కింద రూ. 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలంటే రూ.850 కోట్ల పనుల్లో మరో రూ.120 కోట్లు ఖర్చు చేయాల్సిఉంది. పెద్దవాగు పూర్తికి సైతం మరో రూ.90 కోట్లు కావాలి. ఈ ఐదు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే రూ.1,500 కోట్లకుపైగా నిధులు అవసరం. ఈ నిధులను కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే సేకరించాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు గా తెలిసింది. ఆయన సూచన మేరకు ప్రస్తుతం ఫైలు ఆర్థికశాఖకు చేరింది. అక్కడ దక్కే అనుమతులకు అనుగుణంగా నాబార్డ్‌ లేక ఇతర బ్యాంకుల ద్వారా రుణాలు సేకరించే అవకాశాలున్నాయి. నిర్మాణాలు పూర్తయితే ఈ ఐదు ప్రాజెక్టుల కింద 1.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలుంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement