Irrigation ministry
-
గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను తక్షణమే పంపాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో జరిగిన బోర్డు భేటీలు, అపెక్స్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన హామీల మేరకు వ్యవహరించాలని.. త్వరగా డీపీఆర్‌లను అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించా లని కోరింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వనరుల శాఖ కార్యదర్శులకు బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ శుక్రవారం లేఖ రాశారు. గత ఏడాది జూన్‌లో జరిగిన బోర్డు భేటీ సందర్భంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకొని డీపీఆర్‌లు సమర్పి స్తామని తెలంగాణ అధికారులు వెల్లడించారని, ఏపీ అధికారులు కూడా ఇంకా డీపీఆర్‌లు ఇవ్వని ప్రాజెక్టుల వివరాలు అందజేస్తామని పేర్కొన్నారని వివరించారు. జూన్ 10 నాటికల్లా డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు ఛైర్మన్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కూడా.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కేంద్ర జల శక్తి మంత్రి సూచించారని.. దానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దన్నా.. రెండో అపెక్స్ భేటీ తర్వాత డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు నవంబర్‌లో ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిందని, అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఆదేశించిందని పీఎస్ కుటియాల్ లేఖలో గుర్తు చేశారు. ఎన్నిసార్లు కోరినా తెలంగాణ డీపీఆర్‌లు ఇవ్వలేదన్నారు. ఏపీ పట్టిసీమ, పురుషోత్తమపట్నం డీపీఆర్‌లు ఇచ్చినా, పూర్తి వివరాలు లేవని.. వాటిని పొందుపరచాలని సూచించామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిపెట్టాలని.. వెంటనే డీపీఆర్‌లు అందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. కాగా డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డు కోరిన ప్రాజెక్టుల్లో.. గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెన్‌గంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటి తరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనులు ఉన్నాయి. -
ప్రతిమూలకు ‘ఎత్తిపోత’
రాష్ట్రంలో ఉన్న ఎత్తైన ప్రాంతాల్లోని సాగు నీరందని ప్రతి ప్రదేశానికి నీరు పారించేలా అవసరమైన చోట చిన్న ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్రంలో 1.67 కోట్ల ఎకరాల భూమి సాగుకు అర్హమైనదిగా గుర్తించిన ప్రభుత్వం, ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది పోనూ మిగిలిన మరో 42 లక్షల ఎకరాల భూమిపై దృష్టి పెట్టింది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా కృషిని కొనసాగిస్తున్న ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మూలకూ నీరందించే బృహత్ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన భారీ ఎత్తిపోతల పథకాల పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల్లోని నీటిని వినియోగిస్తూ.. ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే కొన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగా, మరో 100 ఎత్తిపోతల పథకాలు సర్కారు పరిశీలనలో ఉన్నాయి. మొదటగా కరీంనగర్ జిల్లా 13 నియోజకవర్గాల్లోని ప్రతి మండలానికి నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధమవుతుండగా, తదనంతరం ప్రతి జిల్లాకు ఇదేవిధమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళ్లనుంది. 42 లక్షల ఎకరాలపై సర్కారు దృష్టి ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2.76 కోట్ల ఎకరాల విస్తీర్ణం గల భూమి ఉండగా, ఇందులో ప్రస్తుతం చేపట్టిన, చేపట్టనున్న ఎత్తిపోతల పథకాల ద్వారా 1.25 కోట్ల ఎకరాల మేర ఆయకట్టు వృద్ధిలోకి తేవాలని గతంలో ప్రణాళిక ఉంది. ఇందులో ఇప్పటికే భారీ, మధ్య, చిన్నతరహా పథకాల కింద 72 లక్షల ఎకరాల మేర ఆయకట్టు వృధ్ధిలోకి రాగా, మరో 53 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా పనులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పనులు పూర్తయిన చోట్ల కాల్వలపై ఇప్పటికే 1,200 పైగా చెక్‌డ్యామ్‌లు, మరో 600 తూముల నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా ఎక్కడికక్కడ నీటిని కట్టడి చేస్తూ సమర్థ వినియోగం జరిగేలా చూస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గ పరిధిలోని ప్రతి మూలకూ నీరందించేలా కార్యాచరణ మొదలు పెట్టారు. 42 లక్షల ఎకరాలకు సాగు నీరందించడంపై దృష్టి సారించారు. పలు పథకాలకు అనుమతులు నీరు పారే ప్రాంతాలకు ఎత్తున ఉన్న ఈ 42 లక్షల ఎకరాల భూమికి చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీటిని అందించగలిగే అవకాశం ఉన్న దృష్ట్యా, ఇప్పటికే ప్రజా ప్రతినిధులు కోరిన చోట వాటికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సింగూరుపై రెండు ఎత్తిపోతలు చేపట్టి 3.80 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సర్వే పనులు మొదలయ్యాయి. పాలమూరు ప్రాజెక్టులో రెండో రిజర్వాయర్‌గా ఉన్న ఏదుల నుంచి నీటిని తరలిస్తూ అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిద్వారా అత్యంత ఎత్తైన ప్రాంతాలైన అచ్చంపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 70 వేల ఎకరాలకు నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లాలో జాన్‌పహాడ్, నెల్లికల్, ముక్త్యాల వంటి 13 ఎత్తిపోతల పథకాలకు రూ.3 వేల కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వగా, నిజాంసాగర్ దిగువన మంజీరా ఎత్తిపోతలకు రూ.700 కోట్లతో అనుమతులు ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో జకోరా, చండూరు ఎత్తిపోతలకు త్వరలోనే శంకుస్థాపన జరగనుండగా, ఇటీవలే కల్వకుర్తి కాల్వలపై మార్కండేయ ఎత్తిపోతలకు రూ.76 కోట్లతో అనుమతులిచ్చారు. ఇవే కాల్వలపై కర్నెపల్లి తండా ఎత్తిపోతల సర్వే కొనసాగుతోంది. ఇక నిర్మల్ జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలపై రూ.59 కోట్లతో పిప్రి ఎత్తిపోతలు చేపట్టనుండగా, చెన్నూరు నియోజకవర్గానికి నీరిచ్చేలా కాళేశ్వరంలోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల కింద ఎత్తిపోతల పథకాలు చేపట్టి 70 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా తుది ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. తాజాగా రూ.6,300 కోట్ల అంచనా వ్యయంతో.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనల మేరకు సుమారు 100 ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటి ప్రాథమిక అంచనా వ్యయం రూ.6,300 కోట్ల మేర ఉండగా, సుమారు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవాటిలో భూపాలపల్లి నియోజకవర్గంలో 9, మహబూబాబాద్ 4, చొప్పదండి 15, మంథని 7, రామగుండం 5, పినపాక 15, ధర్మపురి 2, మధిరలో 4 వరకు ఎత్తిపోతలు ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో రంగంలోకి ఇంజనీర్లు ఇటీవలి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు తొలుత కరీంనగర్ జిల్లా నుంచి కార్యాచరణ మొదలు పెట్టారు. జిల్లాలోని లోయర్‌మానేరు, మిడ్‌మానేరు, అప్పర్ మానేరు, ఎల్లంపల్లి సహా కాళేశ్వరం కాల్వల పరిధిలో ప్రస్తుతం సాగులో ఉన్న భూమి, సాగులోకి తేవాల్సిన భూమి, ఉన్న చెరువులు, చెక్‌డ్యామ్‌ల వివరాలు ఇంజనీర్లు సేకరిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, మంథని, రామగుండం, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల నియోజకవర్గాల్లోని భూముల మ్యాపులు పరిశీలించడంతో పాటు, సాగు నీటిని అందించేలా ఎత్తిపోతలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. -
కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ శాఖ లేఖ.. తెలంగాణపై ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో కృష్ణా నదీ జలాలను వృధా చేయడంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ ఇరిగేషన్ శాఖ.. కృష్ణానది యాజమాన్య బోర్డుకు(కేఆర్ఎంబీ) లేఖ రాసింది. అనుమతులు లేకుండా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే, విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా జలాలు సముద్రంలోకి పోతున్నాయని, ప్రస్తుతం పులిచింతలలో 18 టీఎంసీల నీరు మాత్రమే ఉందని పేర్కొంది. పులిచింతలలో 152 అడుగుల నీరు దాటినప్పుడే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) నారాయణరెడ్డి లేఖలో ప్రస్తావించారు. -
మీడియం ప్రాజెక్టులకూ రుణాలే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరహా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. నిధుల్లేక నత్తనడకన సాగుతున్న వీటి పనులను పరుగెత్తించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని భారీ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా కార్పొరేషన్ల ద్వారా రుణాల సేకరణ చేస్తున్న ప్రభుత్వం మధ్య తరహా (మీడియం) సాగునీటి ప్రాజెక్టులకు కూడా రుణాలు సేకరించాలని నిర్ణయించింది. మీడియం ప్రాజెక్టులను రుణాలతోనే గట్టెక్కించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సదర్మట్, కుఫ్టి, చనాకా-కొరట, కొమురంభీం, పెద్దవాగు ప్రాజెక్టుల కోసం రుణాల సేకరణకు కసరత్తు ఆరంభించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే వీటికి రుణాలు సేకరించనుంది. రూ.1,500 కోట్ల మేర సేకరణ యత్నాలు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా రుణాలే ఆదుకుంటున్నాయి. ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.91 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.76 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలోంచే రూ.42 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.34 వేల కోట్లు లభ్యతగా ఉన్నాయి. ఇదే కార్పొరేషన్ ద్వారా మరో భారీ ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డికి సైతం రుణాలు తీసుకున్నారు. దీని కోసం రూ.6,160 కోట్ల మేర రుణాలు తీసుకోగా ఇందులో రూ.500 కోట్ల వరకు ఖర్చు చేశారు. సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం, వరదకాల్వ ప్రాజెక్టులకు కలిపి మరో కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రూ.17 వేల కోట్లు రుణాలు తీసుకోగా ఇందులో రూ.9 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ప్రాజెక్టుల పనులు ముందుకు కదులుతున్నాయి. అయితే, మధ్యతరహా ప్రాజెక్టులను మాత్రం నిధులకొరత పీడిస్తోంది. ముఖ్యంగా చనాకా-కొరట పనులను రూ.795 కోట్లతో చేపట్టినా రూ.500 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక సదర్మట్ బ్యారేజీలోనూ ఇప్పటివరకు రూ.520 కోట్లు వెచ్చించగా రూ.220 కోట్ల మేర పనులు మిగిలి ఉన్నాయి. కుఫ్టి ఎత్తిపోతలకు ఇటీవలే రూ.794 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. కొమురంభీం ప్రాజెక్టు కింద రూ. 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలంటే రూ.850 కోట్ల పనుల్లో మరో రూ.120 కోట్లు ఖర్చు చేయాల్సిఉంది. పెద్దవాగు పూర్తికి సైతం మరో రూ.90 కోట్లు కావాలి. ఈ ఐదు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే రూ.1,500 కోట్లకుపైగా నిధులు అవసరం. ఈ నిధులను కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే సేకరించాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు గా తెలిసింది. ఆయన సూచన మేరకు ప్రస్తుతం ఫైలు ఆర్థికశాఖకు చేరింది. అక్కడ దక్కే అనుమతులకు అనుగుణంగా నాబార్డ్ లేక ఇతర బ్యాంకుల ద్వారా రుణాలు సేకరించే అవకాశాలున్నాయి. నిర్మాణాలు పూర్తయితే ఈ ఐదు ప్రాజెక్టుల కింద 1.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలుంటాయి. -
సిద్దిపేట నా కుటుంబం
సిద్దిపేట : నేను ఎక్కడ ఉన్న నా ధ్యాసంతా సిద్దిపేట ప్రజలపైనే, నా కుటుంబం సిద్దిపేటనే. నేను, సీఎం కేసీఆర్‌లు మీరు పెంచిన బిడ్డలం. మీ ప్రేమతోనే నేను ఇంతటి వాడినయ్యాను. నా కుటుంబాన్ని ఎలా చుసుకుంటున్నానో అలాగే సిద్దిపేట ప్రజలపై కూడా ప్రేమ ఉంది. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం రాత్రి శివమ్స్ గార్డెన్లో జరిగిన శివాజీనగర్ వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటను బంగారు తునకగా మార్చడానికి కేసీఆర్ మూడు హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. వాటిలో సిద్దిపేటను జిల్లా కేంద్రంగా సాధించుకున్నామని మరో రెండు హామీలు గోదావరి జలాలు, రైల్వేలైన్ త్వరలో రానుందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్ల పనులను వేగవంతం చేస్తున్నామని త్వరలో గోదావరి జలాలతో జిల్లా బీడు భూములన్ని సస్యశ్యామలంగా మారి మహర్దశ పట్టనుందన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేట ప్రాంతం ఒక రిజర్వాయర్‌గా, ఒక ఇండస్ట్రీయల్ హాబ్‌గా, ఒక పర్యాటక ప్రాంతంగా ఆవిర్భావం కానుందన్నారు. ఈ అభివృద్దిలో ఇంకా మీ సహకారం, భాగస్వామ్యం కావాలని మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. సిద్దిపేట వైశ్య భవన్ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలువనుందన్నారు. సిద్దిపేట వైశ్యులతో సీఎంకు మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. అన్ని సంఘాలు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రం, దేశం అంతా సిద్దిపేట వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. విద్యా, వైద్యరంగంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సులు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త శర్మ, వైశ్య సంఘం ప్రతినిధులు కొమురవెల్లి చందు, వేణు, గంప మహేందర్‌రావు, గంప శ్రీనివాస్, సిద్ధయ్య, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల పర్యవేక్షణ ఎలా?
ఇంజనీర్లతో కార్యదర్శి సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన అనంతరం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉండాలన్న అంశంపై అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. కృష్ణా నదిపై ఆధార పడిన ప్రాజెక్టులు రెండు రాష్ట్రాలకు చెందుతుండడంతో వీటికి సంబంధించిన విధివిధాలను రూపొందించే ప్రక్రియను చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఇంజనీర్లతో సాగునీటి పారుదల శాఖ కార్యదర్శులు సమావేశమై చర్చించారు. కృష్ణానదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో పలు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడంతో వరద నీటిపైనే ఇవి ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. దాంతో ఇటు గోదావరి, అటు కృష్ణా ప్రాజెక్టులకు ప్రత్యేక బోర్డులు రానున్నాయి. అయితే ఈ బోర్డుల పరిధి ఏమిటి? నీటి విడుదల, ప్రాజెక్టుల నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతల వంటి విషయాలపై స్పష్టత లేదు. ఇదే విషయంపై సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి సమక్షంలో ఇంజనీర్లతో చర్చించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను రూపొందించాల్సిందిగా ఆయన సూచించారు. ఇదే అంశంపై ఈ నెల 26వ తేదీన గవర్నర్ సమీక్షించనున్నారని, ఆలోగా పూర్తి స్పష్టతకు రావాలని కోరారు. చట్టం ప్రకారమే విభజన ప్రక్రియ సాగాలి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో తప్పులున్నా.. ఆ చట్టంలో కొన్ని అంశాల గురించి పేర్కొనకపోయినా ప్రస్తుతం చేసేది ఏమీ లేదని, ఆ చట్టం ఏమి చెబుతుందో అదే చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ చట్టం ప్రకారమే విభజన ప్రక్రియను కొనసాగించాలని, చట్టంలో లేని అంశాలేమైనా ఉంటే వాటిని రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక, ఆయా ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగాలనేది కేంద్ర హోంశాఖ అభిప్రాయంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చట్టంలో లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, మహిళా కమిషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, అలాంటప్పుడు వాటి విభజన గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోదని ఉన్నతాధికారి తెలిపారు. వాటిపై ప్రతిపాదనలు ఏమైనా వస్తే అలాంటి వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆ ఉన్నతాధికారి చెప్పారు.