
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో కృష్ణా నదీ జలాలను వృధా చేయడంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ ఇరిగేషన్ శాఖ.. కృష్ణానది యాజమాన్య బోర్డుకు(కేఆర్‌ఎంబీ) లేఖ రాసింది. అనుమతులు లేకుండా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే, విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా జలాలు సముద్రంలోకి పోతున్నాయని, ప్రస్తుతం పులిచింతలలో 18 టీఎంసీల నీరు మాత్రమే ఉందని పేర్కొంది. పులిచింతలలో 152 అడుగుల నీరు దాటినప్పుడే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) నారాయణరెడ్డి లేఖలో ప్రస్తావించారు.