ఇంజనీర్లతో కార్యదర్శి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన అనంతరం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉండాలన్న అంశంపై అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. కృష్ణా నదిపై ఆధార పడిన ప్రాజెక్టులు రెండు రాష్ట్రాలకు చెందుతుండడంతో వీటికి సంబంధించిన విధివిధాలను రూపొందించే ప్రక్రియను చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఇంజనీర్లతో సాగునీటి పారుదల శాఖ కార్యదర్శులు సమావేశమై చర్చించారు. కృష్ణానదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, తెలుగుగంగ, ఎస్సార్‌బీసీ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో పలు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడంతో వరద నీటిపైనే ఇవి ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. దాంతో ఇటు గోదావరి, అటు కృష్ణా ప్రాజెక్టులకు ప్రత్యేక బోర్డులు రానున్నాయి. అయితే ఈ బోర్డుల పరిధి ఏమిటి? నీటి విడుదల, ప్రాజెక్టుల నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతల వంటి విషయాలపై స్పష్టత లేదు. ఇదే విషయంపై సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి సమక్షంలో ఇంజనీర్లతో చర్చించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను రూపొందించాల్సిందిగా ఆయన సూచించారు. ఇదే అంశంపై ఈ నెల 26వ తేదీన గవర్నర్ సమీక్షించనున్నారని, ఆలోగా పూర్తి స్పష్టతకు రావాలని కోరారు.
చట్టం ప్రకారమే విభజన ప్రక్రియ సాగాలి
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో తప్పులున్నా.. ఆ చట్టంలో కొన్ని అంశాల గురించి పేర్కొనకపోయినా ప్రస్తుతం చేసేది ఏమీ లేదని, ఆ చట్టం ఏమి చెబుతుందో అదే చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ చట్టం ప్రకారమే విభజన ప్రక్రియను కొనసాగించాలని, చట్టంలో లేని అంశాలేమైనా ఉంటే వాటిని రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక, ఆయా ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగాలనేది కేంద్ర హోంశాఖ అభిప్రాయంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చట్టంలో లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, మహిళా కమిషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, అలాంటప్పుడు వాటి విభజన గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోదని ఉన్నతాధికారి తెలిపారు. వాటిపై ప్రతిపాదనలు ఏమైనా వస్తే అలాంటి వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆ ఉన్నతాధికారి చెప్పారు.
ప్రాజెక్టుల పర్యవేక్షణ ఎలా?
Published Tue, Mar 25 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement