సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోసం గర్భిణులు, బాలింతలు రాతపూర్వక అండర్ టేకింగ్ పత్రాన్ని సమర్పించే గడువును ఈనెల 28 వరకు పెంచారు. ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళా అభ్యర్థుల్లో గర్భిణులు, బాలింతలకు ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరుకాకుండానే నేరుగా తుది రాత పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు దేహదారుఢ్య పరీక్షలను పూర్తి చేస్తామని రాతపూర్వకంగా అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని బోర్డు నిర్ణయించింది. అయితే తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ అండర్ టేకింగ్ ఇచ్చేందుకు గడువు జనవరి 31 వరకు మాత్రమే ఇచ్చింది. తుది గడువును ఈనెల 28కు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, ఇటీవలే డెలివరీ అయిన అభ్యర్థులకు ఒకసారి మినహాయింపుగా అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అవకాశం కల్పించినట్లు చైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పార్ట్–2 దరఖాస్తును పూర్తి చేసిన అభ్యర్థులకే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్‌సైట్‌లో సూచించిన ఫార్మాట్‌లోనే అండర్ టేకింగ్ పత్రాలను పంపాలని, అలాగే వైద్య ధ్రువీకరణ పత్రాలను జత చేసి లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం ఇన్‌వర్డ్ సెక్షన్‌లో అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment