సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ బాగోతం ఇప్పట్లో సద్దు మణిగేలా కనిపించడం లేదు. విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకుని, సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేశారు. తాజాగా మరో పరీక్షను సైతం వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది రాష్ట్ర ఉద్యోగ నియామక కమిషన్.
కాగా, ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్.. వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 12వ తేదీన జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను వాయిదా వేయగా... మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేసింది.
నిందితులకు కస్టడీ, రిమాండ్
ఇదిలాఉండగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురు నిందితులకు ఐదురోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. షమీమ్, సురేష్, రమేష్ లను నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఇదే కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ మూడు రోజుల కష్టడీ విచారణ మంగళవారంతో ముగిసింది. నలుగురు నిందితులకు కింగ్ కోఠి లోని ప్రభుత్వ ఆస్పత్రి లో వైద్యపరీక్షలు పూర్తి చేశారు. అనంతరం నాంపల్లి న్యాయమూర్తి ముందు పోలీసులు వారిని హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు వారికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నలుగురు నిందితులను సిట్ అధికారులు చంచల్ గూడ సెంట్రల్ జైల్ తరలించారు.
(చదవండి: భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్ )
Comments
Please login to add a commentAdd a comment