సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేయకుండా ప్రైవేటు ట్రావెల్స్‌కు కొమ్ముకాస్తున్న అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్లపై వేటు పడింది. దాదాపు 400 ఏజెంట్లను ఆర్టీసీ తొలగించింది. ఈ ఏజెంట్లు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో సీట్లు బుక్ చేయాల్సి ఉండగా, సంస్థ ఆదాయానికి గండి కొడుతూ, అధిక కమీషన్ ఆశ చూపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సీట్లు బుక్ చేస్తున్నట్టు తాజాగా ఆర్టీసీ విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. అక్టోబర్ 20న ‘ఆర్టీసీలో సీట్లు లేవు.. ప్రైవేటులో వెళ్లండి’శీర్షికతో‘సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వ్ చేసుకునేందుకు వస్తుంటే, వాటిల్లో సీట్లు ఖాళీగా లేవని చెబుతూ ఏజెంట్లు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సీట్లు బుక్ చేస్తున్న తీరును ఆ కథనం ఎండగట్టింది. ఈ విషయం కొంతకాలం క్రితం ఆర్టీసీ అధికారులు పరిశీలనలో కూడా వెలుగు చూసింది. కానీ అప్పట్లో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సాక్షిలో ఏజెంట్ల మోసంపై కథనం రావడంతో, వెంటనే స్పందించిన ఎండీ సజ్జనార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
ఈ మేరకు విజిలెన్స్ సిబ్బంది విచారణ జరిపి టికెట్ బుకింగ్ ఏజెంట్ల పనితీరుపై నివేదిక సమర్పించారు. విచారణలో దాదాపు 400 మంది ఏజెంట్లు ఆర్టీసీకి ఏమాత్రం అనుకూలంగా పనిచేయటం లేదని తేలింది. వీరంతా ప్రైవేటు బస్సుల సీట్లనే బుక్ చేస్తున్నట్టుగా గుర్తించారు. వెంటనే వారందరి ఒప్పందాలను రద్దు చేయాలని ఎండీ ఆదేశించడంతో ఏజెన్సీలను తొలగించారు.
కమీషన్‌తో సంబంధం లేకుండా..
ఆర్టీసీ కౌంటర్లు, వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ కాకుండా అబీబస్ లాంటి సంస్థలతో ఆర్టీసీ టికెట్లు రిజర్వ్ చేయిస్తోంది. దీంతోపాటు దాదాపు 650 ఆథరైజ్డ్ ఏజెంట్లకు కూడా టికెట్ల బుకింగ్‌కు అనుమతించింది. ఇందుకోసం కొంత సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటుంది. బుక్ అయిన ప్రతి టికెట్‌పై దాదాపు 8 శాతం కమీషన్ ఇస్తోంది. అయితే, ఆర్టీసీకి గండికొట్టేందుకు ప్రైవేటు ట్రావెల్స్ 20 శాతం వరకు కమీషన్ ఆశ చూపుతున్నాయి. దీంతో ఏజెంట్లు ట్రావెల్స్ సీట్లనే రిజర్వ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా, కమీషన్‌తో సంబంధం లేకుండా ఉచితంగా సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఎవరికైనా ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి.
టికెట్ బుక్ చేసినందుకు రూ.20 నుంచి రూ.30 వరకు నిర్ధారిత మొత్తాన్ని ఏజెంట్లు.. ప్రయాణికుల నుంచి వసూలు చేసుకుంటే సరిపోతుందని, అప్పుడు వారిపై నిఘా పెట్టాల్సిన పనికూడా ఉండదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సీట్లు మిగిలిపోతున్న తరుణంలో ఏజెంట్లు ఈ పద్ధతిలో ఎన్ని సీట్లు బుక్ చేసినా సంస్థకు ఉపయోగమే కదా అని కొందరు నిపుణులు ఆర్టీసీకి సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment