సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా ప్రారంభిస్తున్న బస్సు సర్వీసు ‘సైబర్ లైనర్’. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం కొత్తగా ఈ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మూడు ఐటీ కారిడార్లలో ఈ బస్సులు నడపనున్నారు. వీటికి ఆదరణ మెరుగ్గా ఉంటే మరికొన్ని బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి ఈ కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. హైటెక్స్ మెట్రో స్టేషన్ సమీపంలో వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
‘వజ్ర’లకు కొత్త రూపు..
దాదాపు ఏడేళ్ల క్రితం ఆర్టీసీ వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటి నిర్వహణ, రూట్ల ఎంపిక పూర్తి లోపభూయిష్టంగా, ప్రణాళిక లేకుండా ఉండటంతో అప్పట్లోనే ఆ ప్రయోగం వికటించింది. రూ.కోట్లలో నష్టాలు వస్తుండటంతో వాటిని దూరప్రాంతాలకు తిప్పటం ప్రారంభించారు.
కానీ, బస్సుల్లో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉండటంతో ఆ ప్రయోగం కూడా విఫలమైంది. చూస్తుండగానే అవి డొక్కుగా మారి తుక్కుకు చేరాయి. మొత్తం వంద బస్సులకు గాను 32 బస్సులు కొంత మెరుగ్గా ఉండటంతో వాటిని పక్కన పెట్టి మిగతావాటిని తుక్కుగా మార్చేశారు. ఇప్పుడు ఆ 32 బస్సులను సైబర్ లైనర్‌లుగా మార్చాలని నిర్ణయించి తొలుత పది బస్సులకు వర్క్‌షాపులో కొత్త రూపు ఇచ్చారు.
ఐటీ రూట్లలోనే ఎందుకంటే..
గతంలో సిటీలో ఓల్వో ఏసీ బస్సులను మెట్రో లగ్జరీలుగా తిప్పటంతో వాటికి ఐటీ ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ మెట్రో రైళ్ల ప్రారంభంతో అవి దివాలా తీశాయి. దీంతో వాటిని తప్పించి దూర ప్రాంత సర్వీసులుగా మార్చారు. అయితే మెట్రో రైలు దిగిన ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లటం కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ ఇబ్బందిని అనుకూలంగా మార్చుకునేందుకు ఆర్టీసీ వీటిని ప్రారంభించింది. మెట్రో రైలు దిగిన ఐటీ ఉద్యోగులకు ఇవి రెడీగా ఉంటాయి. ఇవి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐటీ హబ్ గర్, వేవ్‌రాక్, విప్రో రూట్లలో తిరుగుతాయి.
ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉంటాయి. తిరిగి సాయంత్రం ఐటీ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు.. ఆ మూడు ప్రాంతాల నుంచి తిరిగి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు తిరుగుతాయి. గర్ ప్రాంతానికి రూ.40, మిగతా రెండు ప్రాంతాలకు రూ.30ని టికెట్ ధరగా నిర్ధారించారు. సాధారణ ప్రయాణికులకు కూడా ఇవే వర్తిస్తాయి. ఈ బస్సులకు మధ్యలో హాల్టులుండవు. అందుకే వీటిల్లో కండక్టర్ ఉండడు. ఇవి విజయవంతమైతే మరిన్ని బస్సులను ప్రారంభించాలని ఆర్టీసీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment