
కరకగూడెం: మూఢ నమ్మకం రెండు నెలల చిన్నారిని బలిగొన్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కరకగూడెం మండలం అశ్వాపురపాడు వలస ఆదివాసీ గ్రామాని కి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. సోమవారం రాత్రి నుంచి చిన్నారి కడుపునొప్పితో బాధపడుతుండగా.. వైద్యుని వద్దకు వెళ్లకుండా అదే గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లారు. అతడు బాబు బొడ్డు చుట్టూ కొరకడంతోపాటు పసరు మందు వేశాడు. దీంతో మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశ కార్యకర్త అనారోగ్యంగా ఉన్న బాబుని గుర్తించి వెంటనే తల్లిదండ్రులతో కలసి కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు.