హెచ్‌ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్‌ సోదాలు! | Vigilance Searches At HMDA Office | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలు.. ముందే హెచ్చరించిన సీఎం రేవంత్‌

Published Wed, Feb 28 2024 2:52 PM | Last Updated on Wed, Feb 28 2024 3:53 PM

Vigilance Searches At Hmda Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఆ విభాగం డైరెక్టర్లే లక్ష్యంగా విజిలెన్స్‌ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నాం దాదాపు 50 మంది స్పెషల్‌ టీమ్‌తో అమీర్‌పేట్‌ మైత్రీవనం నాలుగో అంతస్తులో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో.. తొమ్మిదేళ్లపాటు అనుమతులు జారీ చేసిన ఫైల్స్‌పై విజిలెన్స్‌ ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో వాటిని సీజ్‌ సైతం చేసినట్లు తెలుస్తోంది.

హెచ్‌ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్‌, విద్యాధర్‌ గతంలో అనుమతించిన ఫైల్స్‌పై విజిలెన్స్‌ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అరెస్ట్‌ వారెంట్‌తో అధికారులు అక్కడికి వెళ్లడంతో.. ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆన్‌లైన్‌ డేటా నుంచి చెరువులు మాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నాలుగు రోజుల క్రితమే దాడులు జరుగుతాయని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులను ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డాటా ఆన్‌లైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, హెచ్‌ఎండీఏలో కొన్ని రోజుల క్రితం ఏసీబీ కూడా దాడులు నిర్వహించింది. అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయంలో వివిధ జోన్‌లకు చెందిన ఫైళ్లను తెప్పించుకొని తనిఖీ చేశారు. ఫైళ్లను పరిశీలించే క్రమంలో హెచ్‌ఎండీఏలోని ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి జోన్‌లకు చెందిన ప్లానింగ్‌ అధికారులు, ఏపీఓలను తమ వద్దకు రప్పించుకొని పలు అనుమతులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు పని చేసిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ హయాంలో ఇచ్చిన హైరైజ్‌ భవనాల అనుమతులపై ఏసీబీ అధికారులు  దృష్టి సారించారు.

సీఎం రేవంత్‌ సమీక్షపై ఉత్కంఠ
ఒకవైపు విజిలెన్స్‌  సోదాలు కొనసాగుతుండగానే.. మరోవైపు సచివాలయంలో హెచ్‌ఎండీఏపై సీఎం రేవంత్‌రెడ్డి  సమీక్ష జరుపుతున్నారు. నాలుగు రోజుల క్రితమే హెచ్ఎండీఏ పై దాడులు జరుగుతాయని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైనా కీలక నిర్ణయం ప్రభుత్వం వెల్లడించనుందా? అనే ఉత్కంఠ రేకెత్తుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement