చిట్యాలలో గ్రామస్తులతో మాట్లాడుతున్న తహసీల్దార్ సునీత
సాక్షి, తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామానికి బోరు నీరు ఇవ్వలేదనే ఉద్యేశంతో మాజీ కారోబారు కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడవద్దని చాటింపు వేయించిన ఘటన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాజీ కారోబారు నిట్టు నాగేందర్‌రావు, వారి అన్నదమ్ములకు సంబందించిన వ్యవసాయ భూమిలో 20 సంవత్సరాల క్రితం గ్రామస్తులు బోరు వేయించారు. దీంతో అప్పటినుంచి బోరు నీటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. కాగా గత 15 రోజుల క్రితం బోరులో ఉన్న మోటరు చెడిపోయి భూమిలోకి కుంగిపోయి నీరు రావడం లేదు.
దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం అదే స్థలంలో వేరొక బోరు వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నాగేందర్‌రావును అడుగగా నిరాకరించారు. ఎన్నో మార్లు గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి బోరు విషయమై మాట్లాడుతామని చెప్పిన నాగేందర్‌రావు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఒక వేళ బోరు వేసినట్లయితే బోరు నీరు మూడు రోజులు గ్రామస్తులకు, మిగత మూడు రోజులు తనే వాడుకుంటానని తేల్చి చెప్పారు. అంతేకాకుండా నాగేందర్‌రావు లాయర్ ద్వారా సర్పంచ్ కవిత, సర్పంచ్ భర్త బాలయ్య, మరొ ఇద్దరికి నోటీసులు పంపించారు.
దీంతో నాగేందర్‌రావు కుటుంబంతో గ్రామస్తులు ఎవరు మాట్లాడవద్దని ఒకవేళ మాట్లాడితే జరిమాన విధిస్తామని ఆదివారం రాత్రి గ్రామంలో గ్రామపెద్దలు చాటింపు వేయించారు. ఈ విషయం తెసుకున్న నాగేందర్‌రావు, ఆయన కుమారులు నర్సింగరావు, చందర్‌లు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సునీత, ఎస్సై కృష్ణమూర్తిలు చిట్యాలకు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలసుకున్నారు. తహసీల్దార్‌ను వివరణ కోరగా రెండు రోజులలో ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment