village administration
-
అమానుషం: నీరు ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణ
సాక్షి, తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామానికి బోరు నీరు ఇవ్వలేదనే ఉద్యేశంతో మాజీ కారోబారు కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడవద్దని చాటింపు వేయించిన ఘటన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాజీ కారోబారు నిట్టు నాగేందర్రావు, వారి అన్నదమ్ములకు సంబందించిన వ్యవసాయ భూమిలో 20 సంవత్సరాల క్రితం గ్రామస్తులు బోరు వేయించారు. దీంతో అప్పటినుంచి బోరు నీటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. కాగా గత 15 రోజుల క్రితం బోరులో ఉన్న మోటరు చెడిపోయి భూమిలోకి కుంగిపోయి నీరు రావడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం అదే స్థలంలో వేరొక బోరు వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నాగేందర్రావును అడుగగా నిరాకరించారు. ఎన్నో మార్లు గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి బోరు విషయమై మాట్లాడుతామని చెప్పిన నాగేందర్రావు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఒక వేళ బోరు వేసినట్లయితే బోరు నీరు మూడు రోజులు గ్రామస్తులకు, మిగత మూడు రోజులు తనే వాడుకుంటానని తేల్చి చెప్పారు. అంతేకాకుండా నాగేందర్రావు లాయర్ ద్వారా సర్పంచ్ కవిత, సర్పంచ్ భర్త బాలయ్య, మరొ ఇద్దరికి నోటీసులు పంపించారు. దీంతో నాగేందర్రావు కుటుంబంతో గ్రామస్తులు ఎవరు మాట్లాడవద్దని ఒకవేళ మాట్లాడితే జరిమాన విధిస్తామని ఆదివారం రాత్రి గ్రామంలో గ్రామపెద్దలు చాటింపు వేయించారు. ఈ విషయం తెసుకున్న నాగేందర్రావు, ఆయన కుమారులు నర్సింగరావు, చందర్‌లు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సునీత, ఎస్సై కృష్ణమూర్తిలు చిట్యాలకు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలసుకున్నారు. తహసీల్దార్‌ను వివరణ కోరగా రెండు రోజులలో ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. -
పంచాయతీ కార్యదర్శులకు ముగిసిన శిక్షణ
హైదరాబాద్: గ్రామ పరిపాలనలో ఒడిదుడుకులు ఎదురైనా నిరుత్సాహ పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీఎస్‌ఐపార్డ్)లో జరుగుతున్న పంచాయతీ కార్యదర్శుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన 187 మంది కార్యదర్శులకు ట్రైనింగ్ సర్టిఫికేట్లను కమిషనర్ అందజేశారు. కార్యక్రమంలో కోర్సు డెరైక్టర్లు స్వామి, కుసుమ మాధురి, పరిపాలనాధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. -
‘సర్పంచ్ పతి’కి చరమగీతం
న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీల్లో మహిళా సర్పంచ్ల భర్తలు అధికారం చలాయించే సంస్కృతికి ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహిళా సర్పంచ్ల భర్తలు అనుచిత ప్రభావం చూపుతున్నారన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారమిక్క జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పేదరిక నిర్మూలన, విద్యాభివృద్ధికి కృషి చేయడంలో గ్రామస్థాయి ప్రతినిధులు నాయకత్వ పాత్ర పోషించాలన్నారు. ఇటీవలి ఓ రాజకీయ సమావేశంలో ఓ ఎస్పీ(సర్పంచ్ పతి) పాల్గొన్న సంగతిని గుర్తు చేసుకున్నారు. ఈ సంస్కృతి ఇంకా కొనసాగుతోందని, దీనికి ముగింపు పలకాలని అన్నారు. చట్టం మహిళలకు సాధికారికతను ఇచ్చిందని, వారికి తగిన అవకాశమివ్వాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నారు. మధ్యలో బడి మానేస్తున్న పిల్లల సంఖ్య తగ్గించడానికి పంచాయతీలు కృషి చేయాలన్నారు. తమ గ్రామంలో పేదలు లేకుండా చేయాలన్నదే ప్రతి పంచాయతీ లక్ష్యం కావాలని పేర్కొన్నారు. దేశంలోని ఒక్కో గ్రామంలో ఐదుగురిని పేదరికం నుంచి బయటకి తెస్తే దేశవ్యాప్తంగా పెనుమార్పు వస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల భేటీని నిర్విహ స్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీల ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఓ రోజు గంటపాటు స్కూలు పిల్లలతో గడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ స్థానిక సంస్థలకు ఆయన పలు అవార్డులను అందజేశారు. మహిళా రిజర్వేషన్ పదేళ్లు స్థానిక సంస్థల్లో మహిళలకు మరింత ఎక్కువ అవకాశం ఇచ్చే దిశగా కేంద్రం యోచిస్తోంది. ఐదేళ్ల కాలంలో మహిళలు తగినన్ని అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని, వారికి పదేళ్ల రిజర్వేషన్ కల్పించడం ద్వారా తగిన గడువునివ్వాలని భావిస్తోంది. ఢిల్లీలో గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరీ బీరేందర్‌సింగ్ ఈ సంగతి తెలిపారు. వార్డులు, బ్లాకుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పదేళ్లకు(రెండు పర్యాయాలు మహిళలకే రిజర్వేషన్) పొడిగించడం వల్ల వారు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుకునే అవకాశం ఉంటుందన్నారు. జనాభాను బట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉంటాయని, అయితే మహిళల విషయంలో ఇది వర్తించదన్నారు.