‘సర్పంచ్ పతి’కి చరమగీతం | Sarpanch husband key role in village administration | Sakshi
Sakshi News home page

‘సర్పంచ్ పతి’కి చరమగీతం

Published Sat, Apr 25 2015 1:13 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

‘సర్పంచ్ పతి’కి చరమగీతం - Sakshi

‘సర్పంచ్ పతి’కి చరమగీతం

న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీల్లో మహిళా సర్పంచ్‌ల భర్తలు అధికారం చలాయించే సంస్కృతికి ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహిళా సర్పంచ్‌ల భర్తలు అనుచిత ప్రభావం చూపుతున్నారన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారమిక్క జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పేదరిక నిర్మూలన, విద్యాభివృద్ధికి కృషి చేయడంలో గ్రామస్థాయి ప్రతినిధులు నాయకత్వ పాత్ర పోషించాలన్నారు.
 
ఇటీవలి ఓ రాజకీయ సమావేశంలో ఓ ఎస్‌పీ(సర్పంచ్ పతి) పాల్గొన్న సంగతిని గుర్తు చేసుకున్నారు. ఈ సంస్కృతి ఇంకా కొనసాగుతోందని, దీనికి ముగింపు పలకాలని అన్నారు. చట్టం మహిళలకు సాధికారికతను ఇచ్చిందని, వారికి తగిన అవకాశమివ్వాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నారు. మధ్యలో బడి మానేస్తున్న పిల్లల సంఖ్య తగ్గించడానికి  పంచాయతీలు కృషి చేయాలన్నారు.  తమ గ్రామంలో పేదలు లేకుండా చేయాలన్నదే ప్రతి పంచాయతీ లక్ష్యం కావాలని పేర్కొన్నారు. దేశంలోని ఒక్కో గ్రామంలో ఐదుగురిని పేదరికం నుంచి బయటకి తెస్తే దేశవ్యాప్తంగా పెనుమార్పు వస్తుందని అన్నారు.
 
 ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల భేటీని నిర్విహ స్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీల ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఓ రోజు గంటపాటు స్కూలు పిల్లలతో గడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ స్థానిక సంస్థలకు ఆయన పలు అవార్డులను అందజేశారు.
 
 మహిళా రిజర్వేషన్ పదేళ్లు
 స్థానిక సంస్థల్లో మహిళలకు మరింత ఎక్కువ అవకాశం ఇచ్చే దిశగా కేంద్రం యోచిస్తోంది. ఐదేళ్ల కాలంలో మహిళలు తగినన్ని అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని, వారికి పదేళ్ల రిజర్వేషన్ కల్పించడం ద్వారా తగిన గడువునివ్వాలని భావిస్తోంది. ఢిల్లీలో గ్రామీణాభివృద్ధి  మంత్రి చౌదరీ బీరేందర్‌సింగ్ ఈ  సంగతి తెలిపారు. వార్డులు, బ్లాకుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పదేళ్లకు(రెండు పర్యాయాలు మహిళలకే రిజర్వేషన్) పొడిగించడం వల్ల వారు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుకునే అవకాశం ఉంటుందన్నారు.  జనాభాను బట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉంటాయని, అయితే మహిళల విషయంలో ఇది వర్తించదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement