చేవెళ్ల : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలు గుజరాత్ తరువాత తెలంగాణలోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయని, ఇది సంతోషకర పరిణామమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, ఫలితంగా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో కేటీఆర్ శనివారం వెల్‌స్పన్ ఫ్లోరింగ్ యూనిట్‌ను విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందనవెల్లి పారిశ్రామికవాడలోని ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రానుందని, వింబుల్డన్ క్రీడల్లో ఉపయోగించే టవళ్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి కానున్నాయని చెప్పారు. చందనవెల్లి పేరు సిలికాన్‌వ్యాలీలో కూడా వినిపిస్తుందని చెప్పారు. ఒక వెల్‌స్పన్ కంపెనీయే 2021 వరకు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని కేటీఆర్ చెప్పారు. ఇదేగాక కుందన గ్రూప్ కంపెనీ రూ.232 కోట్లతో, కటేనా గ్రూప్ కంపెనీ రూ.318 కోట్లతో నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. రైతులు సహకరిస్తే 3,600 ఎకరాల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు కంపెనీలు నిర్మాణంలో ఉన్నాయని, మరో నాలుగు త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ కూడా స్థలం అడుగుతోందని, మరో పెద్ద కంపెనీ కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. భవిష్యత్తులో 40 నుంచి 50 కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్నందున ఈ ప్రాంతం పారిశ్రామికవాడల ఏర్పాటుకు కలిసివస్తుందన్నారు. ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. శంషాబాద్ పట్టణం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు నాలుగులేన్‌ల రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ సంస్థ ఏర్పాటుచేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, డాక్టర్ ఎం.ఆనంద్, రోహిత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు బాలమల్లు, నాగేందర్‌గౌడ్, జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, వెల్‌స్పన్ కంపెనీ సీఈఓ గోయోంక, నాయకులు కార్తీక్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
111 జీఓను ఎత్తివేసే ఆలోచన
కొంతకాలంగా ఈ ప్రాంతం నాయకులు, ప్రజలు 111 జీఓను ఎత్తివేయాలని అడుగుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి కేటీఆర్ చెప్పారు. చందనవెల్లిలోని వెల్‌స్పన్ కంపెనీ ప్రారంభానికి వెళ్తూ.. షాబాద్ మండలం హైతాబాద్ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెటుకుని, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారని చెప్పారు. దీనిపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment