‘తొలుచువాండ్రు’ తొలి తెలుగు శాసనమే | Which Was First Telugu Inscriptions Once Again Become Debatable | Sakshi
Sakshi News home page

‘తొలుచువాండ్రు’ తొలి తెలుగు శాసనమే

Published Mon, Jan 10 2022 11:10 PM | Last Updated on Tue, Jan 11 2022 8:24 AM

Which Was First Telugu Inscriptions Once Again Become Debatable - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలి తెలుగు శాసనం ఏదన్న అంశం మరోసారి చర్చనీయంగా మారింది. మూడు రోజుల క్రితం ఏపీలోని కడప జిల్లా కలమల్లలో వెలుగు చూసిన ఓ శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా పేర్కొంటున్నారు. బ్రిటిష్‌ పాలకుల సమయంలోనే దీన్ని కనుగొన్నప్పటికీ తర్వాత ఆ శాసనం కనిపించకుండా పోయింది. అయితే అప్పట్లోనే అక్షరాల నకలును తీసి ఉంచారు.

ఈ నకలు ఆధారంగానే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పాఠ్యపుస్తకాల్లో ఈ శాసన ప్రస్తావనను చేర్చారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌ శివారులోని కీసరగుట్టలో గతంలో వెలుగు చూసిన నామక శాసనం (లేబుల్‌ ఇన్‌స్క్రిప్షన్‌) వివరాలను పాఠ్యపుస్తకాల్లోకి చేర్చాలన్న డిమాండ్‌ మొదలైంది. కడప జిల్లాలో వెలుగు చూసిన శాసనం కంటే దాదాపు వందేళ్లకుపైగా ముందే కీసరగుట్ట శాసనం లిఖించారు. దీనిప్రకారం తెలుగులో ఇదే తొలి శాసనమవుతుందన్నది చరిత్రకారుల వాదన. దీన్ని అధికారికంగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. 

కీసరగుట్టలో క్రీ.శ.430 కాలంలో విష్ణుకుండిన మహారాజు రెండో మాధవవర్మ కాలంలో గుండుపై తెలుగు లిపిలో ‘తొలుచువాండ్రు’అన్న పదాన్ని చెక్కారు. అప్పట్లో అక్కడ ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు బస చేసిన ప్రాంతానికి తొలిచేవారు (శిల్పులు) అన్న పేరు పెట్టుకున్నట్టు ఈ పదం స్పష్టం చేస్తోంది. ఈ నామక శాసనం (లేబుల్‌ ఇన్‌స్క్రిప్షన్‌) ప్రస్తుతం తెలుగు లిపి తరహాలో లేదు. బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు లిపి రూపాంతరం చెందుతున్న మొదటి త రం నాటి అక్షరాలు తొలుచువాండ్రు అన్న పదంలో మొదటి రెండు అక్షరాలు బ్రాహ్మీలిపికి దగ్గరగా ఉండగా, మిగతా అక్షరాలు బ్రాహ్మీ నుంచి తెలుగు లిపి రూపాంతరంలో ఉన్నట్టు స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఇలా తెలుగు రూపాంతర అక్షరాలు శాసనం తరహాలో వెలుగు చూడలేదు. దీంతో తొలి తెలుగు శాసనంగా దీన్ని గుర్తించాలని చరిత్రకారులు అంటున్నారు.  

పోయిన శాసనం కలమల్లలోనే గుర్తింపు..  
ఇదిలా ఉండగా కడప జిల్లాలోని కలమల్లలో దేవాలయానికి భూమి దానాన్ని వివరిస్తూ రేనాటి చోళరాజు రేనాటి ధనంజయుడు క్రీస్తుశకం 575లో వేయించిన శాసన రాయిని మూడు రోజుల క్రితం  గుర్తించారు. అయితే తొలుత బ్రిటిష్‌ పాలన సమయంలోనే ఈ శాసనాన్ని గుర్తించి దానిపైనున్న అక్షరాల నకలు తీశారు. శాసన రాయిని చెన్నై మ్యూజియానికి తరలించారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఆ రాయి కనిపించలేదు. దీంతో రాయి అదృశ్యం మిస్టరీగా మారింది. ఇన్నేళ్ల తర్వాత చరిత్ర పరిశోధకులు ఆ రాయిని కలమల్ల దేవాలయంలోనే గుర్తించారు.

కాగా, కీసరలో వెలుగు చూసిన అక్షరాలనే తొలి తెలుగు లేఖనంగా అధికారికంగా గుర్తించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృం దం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొ న్నారు. ఇక ఒక్క పదం ఉన్నా కూడా శాసనంగానే పరిగణించవచ్చని, కీరసలో దొరికింది తొలి తెలుగు శాసనమే అవుతుందని చరిత్ర పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా సీఈఓ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement