ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): పెంచుకున్న పొట్టేలే.. వెనక నుంచి బలంగా పొడవడంతో ఓ మహిళ చేపల చెరువులో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని యాక్తాపురంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు... యాక్తాపురానికి చెందిన బోయ చిట్టెమ్మ (40), భర్త రాముడు గత ఆరు నెలల నుంచి మూడు పొట్టేళ్లను పెంచుతున్నారు.
రోజులానే శనివారం కూడా పొట్టేళ్లను గ్రామం నుంచి తిమ్మాపురం గ్రామ సమీపంలోని తన పొలం దగ్గరికి మేపేందుకు చిట్టెమ్మ తీసుకెళ్లింది. పొలం దగ్గరున్న చేపల చెరువు కట్టపై పొట్టేళ్లు మేస్తుండగా అకస్మాత్తుగా ఓ పొట్టేలు వెనుక నుంచి బలంగా చిట్టెమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె ఒక్కసారిగా చెరువు నీటిలో పడిపోయింది. గమనించిన స్థానికులు నీటి నుంచి ఆమెను బయటికి తీయగా అప్పటికే మృతి చెందింది. ఇదిలాఉండగా, ఇదే పొట్టేలు 20 రోజుల క్రితం చిట్టెమ్మను, 10 రోజుల క్రితం భర్త రాముడిని పొడవడంతో గాయపడ్డారు. సరైన ధర వస్తే ఈ పొట్టేళ్లను విక్రయించాలని అనుకున్నా.. అంతలోనే యజమాని ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది')
Comments
Please login to add a commentAdd a comment