సాక్షి, కరీంనగర్: రాజువయ్యా.. వైఎస్సార్ అంటే ఓ నమ్మకం.. భరోసా.. దిక్కులేని వారు, అన్నార్తులకు ఆపన్నహస్తం.. పేద విద్యార్థుల పాలిట వరం. 108, ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ప్రాణాలు పోసిన ప్రాణదాత.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎంతో మంది లబ్ధిపొందారు.. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరిచేర్చిన విద్యాదాత..ఆయన హయాంలో రూపుదిద్దుకున్న పలు సాగునీటి ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి.. రుణమాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్..ఇలా ప్రజల గుండెల్లో నిలిచారు.. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
వర ప్రదాయినిగా శుక్రవారంపేట రిజర్వాయర్
ముత్తారం(మంథని): మండలంలోని మచ్చుపేట పంచాయతీ పరిధి శుక్రవారంపేటలో 2టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్‌ను 2008లో వైఎస్సార్ ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరచిపోరు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో సుమారు 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. కరువు నేలకు సాగునీరు అందించిన అపర భగీరథుడు వైఎస్సార్ అని ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రలో మహానేతతో ‘ఆది’
వేములవాడ: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించినప్పుడు ఆయన ప్రియ శిశ్యుడు, వేములవాడ రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు ప్రాంతంలో వైఎస్సార్‌ను కలుసుకున్నారు. మహానేతతో కలిసి ఎల్కతుర్తి మండలం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.
పాదయాత్రలో వైఎస్సార్‌తో ఆది శ్రీనివాస్(ఫైల్)
మహానుభావుడు లేకుంటే బతికేవాణ్ణి కాదు
వేములవాడ: మాది వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ వీధి. పదేళ్ల వయస్సులో బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఆ సమయంలో మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నిమ్స్‌లో ఎలాంటి ఖర్చు లేకుండా బ్రెయిన్‌కు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అమ్మానాన్న రేగుల శ్రీనివాస్–మహేశ్వరీతో కలిసి టీకొట్టులో పని చేసుకుంటూ జీవిస్తున్నా. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఆ మహానుభావుడే కారణం. ఆయన మరణం ఈ రాష్ట్రానికి, దేశానికి తీరనిలోటు. ఆ దేవుడిలాంటి వాళ్లు ఇగ పుట్టరేమో అనిపిస్తుంది. – రేగుల సుశీల్, వేములవాడ
విద్యాదాత..
జ్యోతినగర్(రామగుండం): వైఎస్సార్ విద్యాదాత. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీ టెక్ చదివి ఉద్యోగం చేస్తున్న. మా నాన్న సాంబశివారెడ్డి ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్‌షిప్‌లో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో ఇంజినీరింగ్ పూర్తి చేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లోని టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నా. నాలాంటి పేదవారికి ఆయన పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.
– కొణుదుల సుదర్శన్‌రెడ్డి
2 టీఎంసీ పైపులైన్‌తో రెండు పంటలకు నీరు
కమాన్‌పూర్(మంథని): వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో గోదావరినదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గుండారం రిజర్వాయర్ వరకు ఏర్పాటు చేసిన 2టీఎంసీ పైపులైన్‌తో గుండారం రిజర్వాయర్ ఆయకట్ట కింద సాగు చేసే రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతుంది. పైపులైన్ లేక ముందు సాగునీరు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆయకట్టు కింద సాగు వీస్తీర్ణం పెరిగింది.
– పిడుగు గట్టయ్య, రైతు, గుండారం
మంథని అభివృద్ధికి ప్రాధాన్యం
మంథని: వైఎస్సార్ హయాంలో మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. నాడు నియోజకవర్గంలో 60 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకంతో పాటు చింతల చెరువు రిజర్వాయర్‌లకు శంకుస్థాపన చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. శంకుస్థాపన సమయంలో ఇక్కడి గిరిజనులతో మమేకమై వారి సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ప్రగతికి అడ్డుగా నిలిచిన రింగు రోడ్డు నిర్మాణానికి అనుమతులు సాధించి నిర్మాణానికి రూ.48కోట్లు కేటాయించడం విశేషం.
రైతు పక్షపాతి వైఎస్సార్
బోయినపల్లి(చొప్పదండి): రైతు పక్షపాతి వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో మిడ్‌మానేరు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, మల్యాల, గంగాధర, రామడుగు మండలాల మీదుగా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యూలేటర్‌ల వరకు 122 కిలోమీటర్ల మేర వరదకాలువ నిర్మించారు. అప్పుడు వైఎస్సార్ వరదకాలువ నిర్మాణం చేపడితే కాలువలు ఎందుకు తవ్వుతున్నారు అని హేళన చేసినవారు రెండేళ్లుగా కాలువలో చేరుతున్న నీరు రైతన్న చేలకు ఊపిరిగా మారడంతో కంగుతింటున్నారు.
మా ఇంట్లో బస చేశారు
విద్యానగర్(కరీంనగర్): మా నాన్న బొమ్మ వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ప్రచారానికి కరీంనగర్ వచ్చారు. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఉండే వీలు లేకపోవడంతో మా ఇంట్లో బస చేశారు. ఆయన ఎంతో ప్రేమగా పలకరించి నేను చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు. – మూగ జయశ్రీ, ప్రకృతి పర్యావరణ సంస్ధ, అధ్యక్షురాలు, కరీంనగర్
వైఎస్సార్‌తో మూగ జయశ్రీ(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment