విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కొండా రాఘవరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలమ్మ ఖమ్మంలో శుక్రవారం నిర్వహించనున్న ‘సంకల్పసభ’కు అంతా సిద్ధమైంది. ఆమె అనుచర నేతలు, శ్రేణులు భారీగా సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ సభకు ‘సంకల్ప సభ’అని పేరు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజల ఆకాంక్ష అయిన రాజన్న రాజ్యం తెచ్చేలా ఈ సభ నుంచి షర్మిలమ్మ సంకల్పం తీసుకుంటారని ఆమె అనుచర నేతలు ప్రకటించారు.
సభ తర్వాతే పార్టీ ప్రకటన..
సంకల్ప సభలో షర్మిలమ్మ పెట్టబోయే పార్టీ ప్రకటన తేదీని వెల్లడిస్తారని ఆమె అనుచర నేతలు తెలిపారు. తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు సంకల్పసభ వేదిక అవుతుండడంతో వైఎస్సార్ అభిమానుల దృష్టి అంతా ఈ సభపైనే ఉంది. సభకు వైఎస్సార్ సతీమణి విజయమ్మ హాజరై షర్మిలమ్మను ఆశీర్వదిస్తారని నేతలు ప్రకటించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి సభకు అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. లోటస్‌పాండ్ నుంచి వచ్చిన నేతలు సతీష్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి బుధవారం సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఖమ్మం నగరంలో పలుచోట్ల భారీ ఎత్తున షర్మిలమ్మ కటౌట్లు పెట్టారు.
సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు: కొండా
వైఎస్సార్ తనయ షర్మిలమ్మ ఖమ్మంలో శుక్రవారం నిర్వహిస్తున్న సంకల్ప సభకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు ఆమె అనుచర నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో పెద్దతండా ప్రాంతానికి చేరుకోగానే షర్మిలమ్మ, విజయమ్మలకు ఘనస్వాగతం పలికి.. భారీ ర్యాలీతో ఖమ్మంలోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, పడుతున్న ఇబ్బందులపై షర్మిలమ్మ ఉద్యమిస్తారన్నారు. షర్మిలమ్మ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోరని, ఏ పార్టీకి తోక పార్టీ కాదన్నారు.
షర్మిలమ్మ టూర్ షెడ్యూల్ ఇలా..
- ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి బయలుదేరి లక్డీకాపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ మీదుగా 9.30 గంటలకు హయత్‌నగర్ చేరుకోనున్నారు. ఇక్కడ ఆమెకు అనుచర శ్రేణులు స్వాగతం పలుకుతాయి.
- ఉదయం 10.15 గంటలకు చౌటుప్పల్, మధ్యాహ్నం 12 గంటలకు నకిరేకల్, 12.45 గంటలకు సూర్యాపేటలో దారిపొడవునా శ్రేణుల స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం మార్గంలో చివ్వెంల వద్ద భోజన విరామం తీసుకుంటారు.
- మధ్యాహ్నం 2.30 గంటలకు మోతె మండలం నామవరంలో, 3 గంటలకు ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5.15 గంటలకు పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment