
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే దారిలో పడిపోయిన మొక్కలు, జాలీలు
పెద్దేముల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరుగారుతోంది. ఏటా ప్రభుత్వం గ్రామాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి.. వాటి సంరక్షణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రధాన రహదారులపై నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. అంతేకాకుండా నాటిన గుంతల్లోనే మళ్లీ మొక్కలు నాటి లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం మండల అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో 37 వన నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 5 వేల మొక్కలకు తగ్గకుండా పెంచుతున్నారు. ఇందుకోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షణ గ్రామ పంచాయతీ అధికారులకు అప్పగించారు. కానీ పంచాయతీ అధికారులు మొక్కలు నాటడంపై చూపుతున్న శ్రద్ధ వాటి సంరక్షణపై పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద నాటిన మొక్కలు ఎండిపోయాయి. వాటి రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలు పడిపోయినా పట్టించుకునే నాథులే కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్దే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మండలంలోని హైదరాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రధాన రహదారులపై, మంబాపూర్, ఇందూరు, కందనెల్లి, మన్‌సాన్‌పల్లి, ఆత్కూర్ గ్రామాల్లో నాటిన మొక్కలకు నీరు అందక ఎండిపోతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణ, ప్రధాన రహదారులు, ప్రభుత్వ భూములు, ఆలయ స్థలాల్లో మొక్కలు నాటారు. వీటి బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు.
ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది పలు గ్రామాల్లో రూ. 150నుంచి రూ.180 వరకు వెచ్చించి ఒక్కో మొక్కను కొనుగోలు చేసి రోడ్ల పక్క నాటారు. కానీ ఎక్కడా మొక్కలు పెరిగిన దాఖలాలు లేవు. ఈ విషయమై ఎంపీడీఓ లక్ష్మప్పను వివరణ కోరగా మొక్కలు ఎండిపోతే పంచాయతీ కారదర్శులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎండిన హరితహారం మొక్క
Comments
Please login to add a commentAdd a comment