
మహిళా రైతులకు 50శాతం రాయితీతో యంత్ర పరికరాలు
వికారాబాద్: వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకం కేవలం మహిళా రైతులకే వర్తించనుంది. ఎస్‌ఎంఏఎం పథకం పేరుతో అమలు చేయనున్నారు. కిసాన్ సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా ఈ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పదేళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రలక్ష్మి పేరుతో వ్యవసాయ పరికరాలు అందిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే రైతు బంధు, రైతు బీమా పథకాల అమలుతో రాయితీ యంత్రాలకు మంగళం పాడింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి యంత్ర పరికరాలు అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఇంకా పథకాన్ని ప్రకటించలేదు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం మహిళా రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి పథకం విధి విధానాలతో ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హులు ఎవరంటే..
2024 – 25 వ్యవసాయ సంవత్సరానికి గాను ఈ పథకం వర్తింపజేయనున్నారు. రూ.3 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ వర్తించనుంది. వంద శాతం మహిళా రైతులకే పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు రిజర్వేషన్ ప్రాతిపదికన కోటా కేటాయించగా మిగతా సామాజిక వర్గాలకు చెందిన మహిళా రైతులు జనరల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. ఇందులో ఎకరంలోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.లక్ష కంటే ఎక్కువ రాయితీ వర్తించే యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. ఎకరంలోపు భూమి ఉన్నవారు రూ.లక్ష లోపు రాయితీ వర్తించే యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ డ్రోన్లు, మినీ ట్రాక్టర్ లాంటి యంత్ర పరికరాలు కావాలంటే కనీసం రెండున్నర ఎకరాల పొలం ఉండాలి. రైతులు దరఖాస్తు చేసుకున్న తర్వాత జిల్లాస్థాయి కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.
నియోజకవర్గాల వారీగా..
వికారాబాద్ నియోజకవర్గానికి ఎస్సీలకు 25 యూనిట్లు, ఎస్టీలకు 11, జనరల్ 116 మొత్తం 152 యూనిట్లు కేటాయించారు. పరిగి నియోజకవర్గానికి ఎస్సీలకు 17, ఎస్టీలకు 09, జనరల్‌కు 77,మొత్తం 103 యూనిట్లు కేటాయించారు. కొ డంగల్ నియోజకవర్గానికి ఎస్సీలకు20,ఎస్టీలకు 11,జనరల్‌కు 79,మొత్తం 110 యూనిట్లు కేటాయించారు. తాండూరు నియోజకవర్గానికి ఎస్సీలకు 15 యూనిట్లు, ఎస్టీలకు 8, జనరల్‌కు 64, మొత్తం 89 యూనిట్లు కేటాయించారు.ఇందులో కాళ్లు,చేతుల సాయంతో పని చేసే స్ప్రేయర్లు, బ్యాటరీతో పని చేసే స్ప్రేయర్లు ఉన్నాయి. నాగలి, గొర్రు,ఎరువులు, విత్తనాలు వేసే ట్రాక్టర్‌కు వినియోగించే పరికరాలు,పురుగు మందు స్ప్రే చేసేందుకు వినియోగించే డ్రోన్లు కూడా ఉన్నా యి. పవర్ వీడర్లు, బ్రష్ కటర్లు తదితర యంత్ర పరికరాలను రాయితీపై అందజేయనున్నారు.
కేటగిరీల వారీగా..
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలకు చెందిన మహిళా రైతులకు 454 యూనిట్లు మంజూరయ్యాయి. జనరల్ కేటగిరి కింద చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు 338 యూనిట్లు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా రైతులకు 77 యూనిట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు 39 యూనిట్లు కేటాయించారు.
ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం నిర్ణయం
రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు యంత్రాల కొనుగోలుకు అవకాశం
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
మహిళా రైతులకే అవకాశం
ఈ పథకం మహిళా రైతు లకు మాత్రమే..ఆసక్తి ఉన్న వారు సీఎస్సీ సెంటర్‌కు వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దర ఖా స్తు చేసుకోవాలి. వారి వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి.ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు,పాస్‌సైజ్ ఫొటో తీసుకెళ్లాలి. సీ ఎస్సీ పెంటర్ నిర్వాహకులు దరఖాస్తు పూర్తి చేసి ఐ డీ కేటాయిస్తారు.ఇతర వివరాలకు మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
– మోహన్‌రెడ్డి, డీఏఓ