Velagapudi Ramakrishna Babu And Yellow Media Fake News On Voters List - Sakshi
Sakshi News home page

అలా గెలిచావా వెలగపూడి రామకృష్ణబాబు..!

Published Thu, Jul 6 2023 9:14 AM | Last Updated on Thu, Jul 6 2023 4:02 PM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మరోసారి ఓటమి భయంతో ఏం చేయాలో పాలుపోక అధికారులపై అడ్డగోలు ఫిర్యాదులు.. ఎల్లో మీడియా అండతో పచ్చి అబద్ధాల రాతలతో రోత పుట్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా.. ఏ ఒక్కటి డూప్లికేట్‌ ఓటు లేకుండా ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్‌ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే వలస వెళ్లిపోయిన వారి ఓట్లు, మృతుల ఓట్లు, డూప్లికేట్‌ ఓట్లని తొలగిస్తున్నారు. అయితే దీనిపై వెలగపూడి రామకృష్ణబాబు విష ప్రచారానికి తెరతీశారు.

తూర్పు నియోజకవర్గంలో 40 వేల మంది ఓట్లని తొలగించేశారంటూ పచ్చపత్రిక ఈనాడు సహకారంతో హడావిడి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్‌ జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ని ఆదేశించింది. తొలగించిన ఓట్లు వివరాలు.. ఎందుకు తొలగించారో సహేతుకంగా వివరిస్తూ.. ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించారు. ఓట్లు తొలగింపు సక్రమంగానే సాగిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో వెలగపూడి మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఒకే చిరునామాతో 300 ఓట్లు నమోదు చేశారంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ చేస్తే వెలగపూడి బాగోతం బయటపడింది.

73 రోజుల్లో 40 వేల ఓట్లు నమోదు చేసిన టీడీపీ నేతలు
వెలగపూడి ఫిర్యాదు చేస్తూ.. హడావిడి చేస్తుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పు ఎక్కడ జరిగింది.? దీనికి ఎవరు బాధ్యులు అనేది పూర్తిగా అధ్యయనం చేశారు. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల ముందు గంపగుత్తగా వెలగపూడి బ్యాచ్‌ నమోదు చేసిన ఓట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు 2019 జనవరి 11న ఎన్నికల కమిషన్‌ ఓటరు జాబితాని ప్రచురించింది. ఆ తర్వాత ఓటరు నమోదు, చిరునామాల మార్పులకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 25 మార్చి 2019న తుది ఎన్నికల ఓటరు జాబితాని ప్రచురించింది. ఈ 73 రోజుల కాల వ్యవధిలో తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 40,300 మంది అదనపు ఓటర్లు చేరారు.

ఆ తానులో లిస్టే ఇది..
ఇక టీడీపీ ఫిర్యాదు చేసినట్లుగా.. ఒకే ఇంటి నంబర్‌తో 300 ఓట్లు కూడా అప్పటి ఓటర్ల జాబితాలోని దేనని స్పష్టమైంది. 2019 డ్రాఫ్ట్‌రోల్‌లో డోర్‌ నంబర్‌ 13–733తో 282, 769తో 186, 790తో 166 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది కూడా అప్పట్లో టీడీపీ నేతలు నమోదు చేయించిన ఓట్లేనని స్పష్టమవుతోంది. ఇలా 2019 ఎన్నికలకు ముందు నమోదు చేసిన 40,300 అనుమానాస్పద ఓట్లను ఈ మధ్య కాలంలో నిర్వహించిన వెరిఫికేషన్‌లో గుర్తించిన ఎన్నికల సిబ్బంది వడపోత ప్రక్రియ చేపట్టారు. ఇందులో 13,085 డూప్లికేట్‌ ఓట్లు, మరణించిన వారి ఓట్లుగా ఉన్న 1226, శాశ్వతంగా విశాఖ తూర్పు నుంచి వలస వెళ్లినట్లుగా గుర్తించిన 17,769 మంది ఓట్లు.. మొత్తం 32,080 ఓట్లను తొలగించేశారు. ఇది ఓర్వలేకపోతున్న టీడీపీ నేతలు.. 2024 ఎన్నికల్లో ఓటమి ఖాయమని భయపడి.. ఆ ఓట్లు తిరిగి చేర్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ఎన్నికల ముందే కథంతా..
2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా తుది జాబితా ముద్రణ అయ్యింది. అలా ఎన్నికల ముందు టీడీపీ బ్యాచ్‌ తూర్పు నియోజవర్గంలో ఏకంగా 40,300 దొంగ ఓట్లని నమోదు చేయించారు. 2019 ఎన్నికల్లో వెలగపూడికి 87,073 ఓట్లు రాగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మలకు 60,599 ఓట్లు వచ్చాయి. అంటే 26,474 ఓట్లు తేడాతో వెలగపూడి విజయం సాధించారు. ఈ విజయం కూడా సదరు టీడీపీ నేతలు నమోదు చేసిన 40,300 ఓట్ల కారణంగానే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అకారణంగా ఓటు తొలగించే ప్రసక్తే లేదు
ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల సిబ్బంది ఓట్లు తొలగించారని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పూర్తి పారదర్శకంగా ఓటరు నమోదు ప్రక్రియతో పాటు.. వెరిఫికేషన్‌ కూడా పక్కాగా నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా చిన్న తప్పు దొర్లినా బీఎల్‌వోలపై చర్యలకు ఉపక్రమిస్తున్నాం. 24, 104, 236 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 222 మంది తాత్కాలిక వలసదారుల ఓట్లని విధుల్లో అలసత్వం కారణంగా తొలగించారు. తుది పరిశీలనలో వీటిని గుర్తించి తిరిగి చేర్చాం. సదరు బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. గతంలో ఉన్న జాబితాలో మూడు కారణాలతో పలు దశల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసిన అనంతరం తొలగించాం. ఎవరైనా ఓటు లేదని భావించినా, చిరునామా మారినా, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నా ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారు. అకారణంగా ఓటు తొలగించారని తెలిస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి

దొంగ ఓట్లు సృష్టించారు
2019 ఎన్నికలకు ముందే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరుల ద్వారా వేల కొద్దీ దొంగ ఓట్లు సృష్టించారు. ఇప్పుడు అవి తొలగిస్తుంటే భయం పట్టుకుని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పారదర్శకంగా జాబితాని రూపొందిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ దొంగ ఓట్లు బాగోతం బట్టబయలవుతోంది. నియోజకవర్గంలో నమోదైన దొంగ ఓట్లలో ఎక్కువగా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నవారి పేర్లే ఉన్నాయి. ప్రతిసారీ దొంగ ఓట్లతోనే విజయం సాధిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈ సారి ఆ పప్పులు ఉడకక పోవడంతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారు.
– అక్కరమాని విజయనిర్మల, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement