విశాఖపట్నం: కై లాసగిరి కొండ అంచు నుంచి సాగర కెరటాల హోయలను చూస్తూ నైట్ స్టే చేస్తే.. కొండపై నుంచి విశాఖ అందాలను చూస్తూ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆరగిస్తుంటే.. ఊహించుకోడానికే ఎంతో బాగుంది కదూ.. సముద్ర తీరాన భారీ నౌకలో అతిథ్యం.. కారవాన్‌లో విహారం.. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా నేచ్యురల్ హిస్టరీ పార్కు.. సైన్స్ మ్యూజియం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేలా వినూత్న, బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి తోడు దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాలకు పోటీ పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా త్వరలోనే పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆతిథ్య రంగం మరింతగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్‌లో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
ఎటు చూసినా అందమే.. ఎటు చూసినా ఆనందమే.. చూసే కనులకు మనసుంటే.. ఆ మనసుకు కూడా కళ్లుంటే.. అని చెప్పిన సినీ కవి మాటలు.. అచ్చుగుద్దినట్లు ప్రకృతి రమణీయతతో ఓలలాడే విశాఖకు సరిపోతాయి. విశాఖను చూసేందుకు దేశ, విదేశాల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఒకవైపు విశాఖ అభివృద్ధితో పాటు మరో వైపు పర్యాటకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని కార్యరూపం దాల్చగా.. మరికొన్ని సమగ్ర నివేదిక దశలో.. ఇంకొన్ని ప్రణాళికల దశలో ఉన్నాయి. నగరం నుంచి భీమిలి వరకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడంతో పలు బీచ్‌ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. రుషికొండ బీచ్‌లో చేపట్టిన అభివృద్ధితో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది.
విశాఖపై దిగ్గజ సంస్థల ఆసక్తి
అతిథ్య రంగంలో విశాఖ ఇప్పటికే తనదైన ముద్ర వేస్తోంది. నగరంలో త్రీస్టార్ నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లు అనేకమున్నాయి. విశాఖ కేంద్రంగా పరిపాలన కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల తాకిడి పెరుగుతుంది. తద్వారా హోటళ్లు, రిసార్టుల వ్యాపారం రెట్టింపవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తగ్గట్టుగానే విశాఖలో దిగ్గజ అతిథ్య రంగ సంస్థలు ఒబెరాయ్, మేఫెయిర్ సంస్థలు 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఒబెరాయ్ సంస్థ భీమిలి మండలం అన్నవరంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.350 కోట్ల వ్యయంతో విల్లా రిసార్టుల నిర్మాణం చేపడుతోంది.
ఈ రిసార్టు పనులకు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే భీమిలి మండలం అన్నవరంలోనే మేఫెయిర్ సంస్థ 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 7 స్టార్ హోటల్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటితో పాటు వీఎంఆర్‌డీఏ పార్కు వెనుక మైస్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. భవిష్యత్‌లో విశాఖ అతిథ్య రంగానికి ఉన్న డిమాండ్‌కు ఈ సంస్థల రాకే నిదర్శనం.
వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి
విశాఖలో వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సింహాచలం, కనకమహాలక్ష్మి దేవస్థానాలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ప్రసాదం స్కీమ్‌లో భాగంగా సింహాచలం ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక్కడ ప్రాచీన ఆలయాలను సర్క్యూట్‌గా చేసి స్పిరిచ్యువల్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలన ప్రారంభమైతే నగరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా విమాన సర్వీసులు కూడా రెట్టింపవుతాయి. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరగడం ద్వారా మెడికల్, స్పిరిచ్యువల్ టూరిజంకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట
దొండపర్తి: పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట పండింది. రాష్ట్ర వార్షిక టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను వివిధ కేటగిరీల కింద విశాఖలో ఉన్న హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ 5 స్టార్ హోటల్‌గా రాడిసన్ బ్లూ అవార్డును దక్కించుకుంది. అలాగే 4 స్టార్ విభాగంలో హోటల్ దసపల్లా, బెస్ట్ బడ్జెట్ హోటల్‌గా ఎలిగంట్ హోటల్, బెస్ట్ హరితా హోటల్‌గా అరకు హరిత వ్యాలీ రిసార్ట్, బెస్ట్ హోటల్ బేస్డ్ మీటింగ్ వెన్యూగా వరుణ్‌బీచ్ నోవోటెల్, బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హోటల్‌గా గ్రీన్‌పార్క్‌లో మెకాంగ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్–అలోన్ రెస్టారెంట్‌గా టైకూన్ అండ్ హెరిటేజ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్‌గా వైజాగ్ కన్వెన్షన్స్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అలాగే బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్(డొమస్టిక్)గా ట్రావెల్ హోం, బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా ట్రావెల్ ఐక్యూ గ్లోబల్ సొల్యూషన్స్, మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా హాలిడే వరల్డ్, బెస్ట్ టూరిజం ప్రమోషన్ కొల్లాటిరల్ పబ్లిసిటీ మెటీరియల్‌గా విశాఖపట్నం పాకెట్ టూరిస్ట్ గైడ్, మోస్ట్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బెస్ట్ టూరిజం వెబ్‌సైట్‌గా యో వైజాగ్‌కు అవార్డులు లభించాయి.
అతిథ్య రంగానికి మహర్దశ
విశాఖలో పరిపాలన ప్రారంభమైతే అతిథ్య రంగానికి మహర్దశ పడుతుంది. ప్రముఖుల రాకతో హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్ల వ్యాపారం బాగుంటుంది. తద్వారా అనేక సంస్థలు విశాఖలో హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి రూ.కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటక, ఆతిథ్య రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావంతో అన్ని రంగాలు కూడా పుంజుకుంటాయి.
– పవన్ కార్తీక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా..
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే విశాఖలో అతిథ్య రంగం పుంజుకుంది. ఒబెరాయ్, మేఫెయిర్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ లగ్జరీ హోటళ్లు నిర్మాణానికి ముందుకొచ్చాయి. వీటితో పాటు మెడికల్, స్పిరిచ్యుటవల్ టూరిజంపై కూడా దృష్టి పెడుతున్నాం. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే తద్వారా పెట్టుబడులు, దాంతో ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఆ దిశగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది.
– శ్రీనివాస్ పాని, రీజినల్ డైరెక్టర్, పర్యాటక శాఖ
Comments
Please login to add a commentAdd a comment