కూర్మన్నపాలెం: అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరకయాతన అనుభవించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతానికి చెందిన డి.కావ్యప్రియ (18), భీమవరం ప్రాంతానికి చెందిన ఫణీంద్ర అనే యువకుడితో కలిసి ఈ నెల 2వ తేదీ నుంచి అప్పికొండ శివాలయ పరిసర ప్రాంతంలో ఉంటుంది. ఆదివారం సాయంత్రం తీరం వద్ద రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటుండగా, ఎత్తు ప్రదేశం నుంచి జారి పడి రాళ్ల గుట్టల మధ్య ఉండిపోయింది.
అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను వదిలేసి యువకుడు పరారయ్యాడు. చిమ్మ చీకటి, జనసంచారం లేని ప్రదేశంలో రాత్రంతా మృత్యువుతో పోరాడిన ఆమెను సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు గుర్తించి గజఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. కాలు జారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏమీ అనవద్దని ఆమె ప్రాథేయపడింది. యువతి తల్లికి అంబులెన్స్ సిబ్బంది సమాచారమివ్వగా, తాము విశాఖ వస్తున్నామని చెప్పారు.
తమ కుమార్తె కనిపించడంలేదని యలమకుదురు పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లి చెప్పింది. కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు బందరు పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గాజువాక ఏసీపీ త్రినాఽథ్, దువ్వాడ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేజీహెచ్‌కు చేరుకొని యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి పడిందా... లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment