యలమంచిలి రూరల్: తన తండ్రి ఇరవై ఏళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన యజమానిని, అతని నమ్మకాన్ని అవకాశంగా చేసుకుని ఓ యువకుడు నిలువునా మోసగించాడు. ఒకటి, రెండు లక్షలు కాదు.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో బురిడీ కొట్టించి ఏకంగా రూ.కోటి కాజేశాడు. ‘షేర్ మార్కెట్ పేరుతో రూ.కోటికి కుచ్చు టోపీ’ శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక మంగళవారం సంచికలో ఈ వార్త ప్రచురితమైన విషయం విదితమే. బాధితుడి ఫిర్యాదుతో యలమంచిలి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. యలమంచిలి పట్టణం సీపీ పేటకు చెందిన వీసం రామకృష్ణ గతంలో ఐరన్ స్క్రాప్ వ్యాపారం చేసేవారు. ఆయన వద్ద అచ్యుతాపురానికి చెందిన నెట్టెం గోవింద్ డ్రైవర్‌గా 20 ఏళ్లు పనిచేశాడు. యజమానికి డ్రైవర్ అంటే అపారమైన నమ్మకం.
ఈ డ్రైవర్‌కు కూడా యజమాని రామకృష్ణ పట్ల ఎంతో విశ్వాసం. ఈ పరిస్థితుల్లో డ్రైవర్ కుమారుడు నెట్టెం సాయి శ్యామ్‌కుమార్ స్టాక్ మార్కెట్ పేరుతో యజమాని వీసం రామకృష్ణకు కుచ్చుటోపీ పెట్టాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో అపారమైన లాభాలు వస్తాయని, తన స్నేహితుడు పెట్టుబడి పెడితే తాను స్టాక్‌మార్కెట్ లావాదేవీలు చేస్తున్నానని నమ్మించాడు. వచ్చిన లాభాలను తన స్నేహితుడు 60 శాతం, తాను 40 శాతం తీసుకుంటున్నామని నమ్మబలికాడు. అందుచేత మీరు కూడా పెట్టుబడి పెడితే బోలెడు లాభాలు తెస్తానని మోసపూరితమైన మాటలు చెప్పడంతో రామకృష్ణ నిజమేననుకున్నారు.
రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో రూ.1.2 కోట్లు తమ స్నేహితుడికి వచ్చాయని ఫేక్ ఆన్‌లైన్ మెసేజ్‌లు సృష్టించి, వాటి స్క్రీన్‌షాట్‌లను రామకృష్ణకు చూపించాడు. దీంతో ఆయన మొదట రూ.20 లక్షలు తన ఖాతా నుంచి శ్యామ్‌కుమార్ బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్ బదిలీ చేశారు.ఆ తరువాత మరో రూ.20 లక్షలు, తదుపరి రూ.30 లక్షలు, అనంతరం రూ.28 లక్షలు, చివరిగా రూ.2 లక్షలు నగదు పంపించారు. సెప్టెంబరు 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకూ ఐదు దఫాలుగా నగదును శ్యామ్‌కుమార్ ఖాతాకు బదిలీ చేశారు. అప్పటి నుంచి రోజూ సెల్‌ఫోన్ ద్వారా ఫేక్ మెసేజ్‌లు పెట్టి లాభాలు వచ్చినట్టు శ్యామ్‌కుమార్ వీసం రామకృష్ణకు చూపేవాడు. ఆయన పెట్టిన రూ.కోటి పెట్టుబడి రూ.2.80, 50,000లకు పెరిగిందని చెప్పాడు.
షేర్ మార్కెట్ నుంచి విత్ డ్రా చేయకపోవడంతో అనుమానం
షేర్ మార్కెట్ ప్రమాదమని, డబ్బు విత్ డ్రా చేయమని, గత ఏడాది ఆగస్టులో రామకృష్ణ కోరారు. కానీ శ్యామ్‌కుమార్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా వాయిదాలు పెడుతూ డిసెంబరు 21 వరకూ కాలయాపన చేశాడు. డిసెంబరు 21న పోలీసుల దృష్టికి తీసుకెళితే 2024 జనవరి 1 నాటికి ఇచ్చేస్తానని రాత పూర్వకంగా శ్యామ్‌కుమార్ రాసి ఇచ్చినట్టు బాధితుడు చెప్పారు. ఆ తరువాత అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు చేశారు.
పోలీసులు శ్యామ్‌కుమార్ ట్రేడింగ్‌కు ఉపయోగించిన లాప్‌టాప్‌ను పరిశీలిస్తే డీ మ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ ఖాతాల వివరాలు తెలియలేదు. తప్పుడు పాస్‌వర్డ్‌లు చెప్పేవాడని బాధితుడి బంధువు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పట్టణ ఎస్సై పాపినాయుడు తెలిపారు. కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్న శ్యామ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment