సైలెంట్‌ మోడ్‌లో సీబీఐ.! | - | Sakshi
Sakshi News home page

సైలెంట్‌ మోడ్‌లో సీబీఐ.!

Published Mon, May 20 2024 6:55 AM | Last Updated on Mon, May 20 2024 8:54 AM

సైలెంట్‌ మోడ్‌లో సీబీఐ.!

సైలెంట్‌ మోడ్‌లో సీబీఐ.!

నత్తనడకన డ్రగ్స్‌ కేసు దర్యాప్తు

మౌనం వహిస్తున్న దర్యాప్తు బృందం

భారీగా లభ్యమైనా కనిపించని పురోగతి

సంధ్యా ఆక్వా ప్రతినిధులను తూతూ మంత్రంగా విచారించిన వైనం

డ్రగ్స్‌ తీసుకొచ్చిన సంస్థను గాలికొదిలేసిన సీబీఐ

ఆధారాలేవీ సేకరించకుండా బ్రెజిల్‌కి ఇలా వెళ్లి అలా వచ్చేసిన బృందం

సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి.. భారీగా డ్రగ్స్‌ పట్టుకున్న సీబీఐ దాని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను కనిపెట్టే విషయంలో మాత్రం నిర్లిప్తత వహిస్తోంది. మూలాలు శోధించేందుకు బ్రెజిల్‌ వెళ్లిన బృందాలు కొండని తవ్వి కనీసం ఎలుక జాడ కూడా కనిపెట్టలేకపోయాయి. ప్రధాన పాత్రధారులుగా ఉన్న సంధ్యా ఆక్వా ప్రతినిధులు కళ్లెదుటే ఉన్నా కనీసం సమగ్రంగా విచారించకుండా వదిలేయడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్‌ తీసుకొచ్చిన సంస్థపై చర్యలు తీసుకోకుండా గాలికొదిలేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మార్చి 19న విశాఖపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ (వీసీటీపీఎల్‌)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ దిగుమతి రాకెట్‌ని సీబీఐ బట్టబయలు చేసింది. బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి బయలుదేరిన షిప్‌లోని కంటైనర్‌లో డ్రైఈస్ట్‌ని తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా సంస్థ.. అందులో డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తమకు తెలీదంటూ బుకాయిస్తోంది. డ్రగ్స్‌ దొరికిన తొలి రోజున సంస్థ ప్రతినిధులను రెండు గంటల సేపు మాత్రమే సీబీఐ అధికారులు విచారించారు. తమకేమీ తెలీదని చెప్పడంతో వదిలేశారు. తర్వాత ఇంత వరకూ సంధ్యా ఆక్వా ప్రతినిధుల జోలికి సీబీఐ వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

 ప్రాథమికంగా సంధ్య ఆక్వా ప్రతినిధుల నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశాలున్నా కనీసం ఆ దిశగా సీబీఐ విచారించకపోవడం గమనార్హం. మొత్తం కంటైనర్‌లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం బ్యాగ్స్‌లో ఉన్న డ్రైఈస్ట్‌లో కొకై న్‌, హెరాయిన్‌, ఓపియం, కొడైన్‌, మెథలాక్విన్‌ తదితర డ్రగ్స్‌ అవశేషాలున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే 30 శాతం బ్యాగుల్లో పూర్తిస్థాయిలో డ్రైఈస్ట్‌ లోడ్‌ చేసి ఒకవేళ పరీక్షలు నిర్వహించినా దొరకవనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికలతోనే డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐకి ఇంటర్‌పోల్‌ నుంచి సమాచారం రావడంతో ఈ రాకెట్‌ గుట్టురట్లు అయింది. పక్కాగా డ్రగ్స్‌ అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలున్నా సంధ్యా ఆక్వాపై ఇంతవరకూ సీబీఐ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

రిపోర్టులూ మరింత ఆలస్యం.?
తమ దగ్గర ఉన్న కిట్స్‌ సాయంతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో డ్రగ్స్‌ అవశేషాలున్నట్లు సీబీఐ గుర్తించింది. అయితే ఒక్కో బ్యాగ్‌లో ఎంత మొత్తం డ్రగ్స్‌ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్‌ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి పంపించారు. అయితే ఇంతవరకూ దీనికి సంబంధించిన రిపోర్టులు రాలేదని సీబీఐ చెబుతోంది. సాధారణంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి 10 నుంచి 15 రోజుల్లో నివేదిక వస్తుందని సంధ్యా డ్రగ్స్‌కు సంబంధించిన రిపోర్టు దాదాపు రెండు నెలలు కావస్తున్నా బయటికి రాకపోవడంపైనా సీబీఐ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

బ్రెజిల్‌ వెళ్లి ఏం చేశారు..?

మరోవైపు డ్రగ్స్‌ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తామంటూ సీబీఐకి చెందిన బృందం బ్రెజిల్‌ పయనమయ్యాయి. శాంటోస్‌ పోర్టుకు డ్రైఈస్ట్‌ తరలించిన ఓషన్‌ నెట్‌వర్క్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థతో పాటు కార్గో షిప్‌ వచ్చిన మార్గంతో పాటు షిప్‌ ఆగిన పోర్టుల్లో సీసీటీవీ పుటేజ్‌ సేకరించాలని సీబీఐ బృందం బ్రెజిల్‌ వెళ్లినట్లు తెలిసింది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బ్రెజిల్‌ నుంచి సీబీఐ బృందం తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ అసలు దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో కూడా సీబీఐ వెల్లడించకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఎక్కడ కంటైనర్‌ అక్కడే..
రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ విషయంలోనూ సీబీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎక్కడైతే తనిఖీలు నిర్వహించారో ఆ ప్రాంతమైన వీసీటీపీఎల్‌లోనే డ్రగ్స్‌ దొరికిన కంటైనర్‌ని సీబీఐ సీజ్‌ చేసి విడిచి పెట్టేసింది. కంటైనర్‌ టెర్మినల్‌లో కస్టమ్స్‌ తనిఖీల్లో పట్టుబడిన కంటైనర్లతో పాటు ఈ డ్రగ్స్‌ కంటైనర్‌ కూడా విడిచిపెట్టేశారు. ఎర్రచందనం, నిషేధిత వస్తువులతో వచ్చిన కంటైనర్లను వీసీటీపీఎల్‌లోని ఓ ప్రాంతంలో ఉంచేస్తారు. దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా ఈ కంటైనర్లు ఇక్కడే ఉన్నాయి. వాటితో పాటుగా.. డ్రగ్స్‌ కంటైనర్‌ని కూడా సీబీఐ విడిచి పెట్టేసింది. కస్టమ్స్‌, వీసీటీపీఎల్‌ ప్రతినిధుల్ని ఆ కంటైనర్‌ భద్రపరచాలని సీబీఐ సూచించిందే తప్ప.. తమ తరఫున ఒక భద్రతా సిబ్బందిని కూడా కంటైనర్‌ వద్ద ఉంచకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా డ్రగ్స్‌ దోషులను బయటకి లాగాలని దర్యాప్తును సీబీఐ త్వరగా పూర్తి చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement