పెళ్లయిన 15 ఏళ్లకు ఇద్దరు పిల్లలు
సంతోషంలో మురిసిపోయిన కూలి దంపతులు
పిల్లల మందులకు వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి
అనాథలైన పిల్లలు, భార్య విషాదంలో వెంకటరమణపేట వాసులు
ఆ దంపతులిద్దరూ కూలీలే అయినా వారి జీవితం ఆనందమయం. వచ్చిన కూలి డబ్బులతో ఉన్నంతలో సంతోషంగా ఉండేవారు. వారి అన్యోన్యతను చూసి ఊరే ముచ్చటపడేది. వివాహమైన 15 ఏళ్లకు ఇద్దరు కవలలు జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలను చూస్తూ మురిసిపోయేవారు. ఇంతలో విధి కన్నెర్ర చేసింది. పిల్లల మందుల కోసం వెళ్లిన భర్తను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరు పిల్లలు, భార్యను అనాథులను చేసింది. కలలను కన్నీటితో తుడిచేసింది.
శృంగవరపుకోట: ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన గేదెల కృష్ణ(42) క్వారీ కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి లక్ష్మితో సుమారు 15 ఏళ్ల కిందట వివాహమైంది. సంతానం లేక పోవడంతో చాలా కాలంగా మదనపడ్డారు. సంతానం కోసం మొక్కని దేవుడు లేడు.. తిరగని ఆస్పత్రి లేదు. చివరకు రెక్కలు ముక్కలు చేసుకుని దంపతులిద్దరూ కూలిచేసి సంపాదించిన సొమ్ముతో శక్తికి మించి లక్షలు ఖర్చు చేసి సంతాన సాఫల్య కేంద్రంలో కొన్నేళ్లుగా వైద్యం చేయించుకున్నారు. వారి కలలు సాకారమై లక్ష్మి గర్భం దాల్చింది. దీంతో వాళ్ల సంతోషానికి అవధులు లేవు. రెండు నెలల కిందట కవలలు (మగబిడ్డ, ఆడబిడ్డ)లకు లక్ష్మి జన్మనిచ్చింది. బిడ్డలను చూస్తూ దంపతులిద్దరూ మురిసిపోయారు. అంతలోనే విధి కన్నెర్రచేసింది. ఇంటి దిక్కును మృత్యువు కాటేసి సంతోషాన్ని ఆవిరిచేసింది.
భర్త దూరం.. బతుకు భారం..
క్వారీలో పనిచేసే కృష్ణ తన కష్టం మరిచిపోయి భార్య, బిడ్డలతో సరదాగా ఉన్నాడు. మంగళవారం ఉదయం బిడ్డలకు మందులు తెస్తా నంటూ బైక్‌పై విశాఖ వెళ్తున్న సమయంలో వేపగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న భార్య కన్నీరుమున్నీరవుతోంది. బిడ్డలకు, తనకు దిక్కెవరంటూ ఆమె రోదన వర్ణణాతీతం. కృష్ణ చనిపోయాడన్న వార్తతో ఊరంతా ఒక్కసారి గొల్లుమంది. భార్య లక్ష్మి రెండునెలల చిన్నారులను చెరో చెంకనెత్తుకుని ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఏ దిక్కూలేని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి దా తలు సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment